IPL 2024: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మ‌న్ గిల్.. యువ క్రికెట‌ర్ పేరిట‌ ఐపీఎల్‌లో మ‌రో అరుదైన ఘ‌న‌త‌!

  • ఐపీఎల్‌లో 3 వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న పిన్న వ‌య‌స్కుడిగా శుభ్‌మ‌న్‌
  • 24 ఏళ్ల 215 రోజుల్లో ఈ ఘ‌న‌త సాధించిన యువ క్రికెట‌ర్‌
  • మూడువేల పరుగుల మార్క్‌ను 26 ఏళ్ల 186 రోజుల్లో అందుకున్న విరాట్ కోహ్లీ
  • ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (94 ఇన్నింగ్స్‌లు) 3 వేల‌ పరుగులు సాధించిన రెండవ భారత‌ ఆటగాడిగా గిల్
  • 80 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని సాధించిన కేఎల్ రాహుల్‌
Shubman Gill breaks Virat Kohli record

గుజ‌రాత్ టైటాన్స్ సార‌ధి శుభ్‌మ‌న్ గిల్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. 3 వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న పిన్న వ‌య‌స్కుడిగా నిలిచాడు. కేవలం 24 ఏళ్ల 215 రోజుల్లో గిల్ ఈ ఘ‌న‌త సాధించాడు. త‌ద్వారా ర‌న్‌మెషిన్, ఆర్‌సీబీ స్టార్‌ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును ఈ యువ క్రికెట‌ర్ బ‌ద్ద‌లు కొట్టాడు. విరాట్ మూడువేల పరుగు‌ల మార్క్‌ను 26 ఏళ్ల 186 రోజుల్లో సాధించ‌డం జ‌రిగింది. అలాగే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో శుభమన్ గిల్ మ‌రో రికార్డును కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 3000 పరుగులు సాధించిన రెండవ భారతీయ ఆటగాడిగా గిల్ నిలిచాడు. కేఎల్‌ రాహుల్ 80 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని సాధించ‌గా.. గిల్ 94 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 

ఐపీఎల్‌లో త‌క్కువ‌ వయసులో 3వేల‌ పరుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితా 
24 ఏళ్ల‌ 215 రోజులు - శుభ్‌మన్ గిల్*
26 ఏళ్ల 186 రోజులు - విరాట్ కోహ్లీ
26 ఏళ్ల 320 రోజులు - సంజు శాంసన్
27 ఏళ్ల 161 రోజులు - సురేష్ రైనా
27 ఏళ్ల  343 రోజులు - రోహిత్ శర్మ

3వేల ఐపీఎల్‌ పరుగుల కోసం అతి తక్కువ ఇన్నింగ్స్‌లు ఆడింది వీరే
75 - క్రిస్ గేల్
80 - కేఎల్ రాహుల్
85 - జోస్ బట్లర్
94 - శుభ్‌మన్ గిల్
94 - డేవిడ్ వార్నర్
94 - ఫాఫ్ డుప్లెసిస్

ఇక ఇటీవ‌ల భార‌త జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా మారిన‌ శుభ్‌మన్ గిల్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌, నిల‌క‌డ‌యిన ఆట‌తో ప‌లు రికార్డులు తిర‌గ‌రాస్తున్నాడు. ఇదే అత‌డిని ప్రముఖ క్రికెట‌ర్ల స‌ర‌స‌న చేరేలా చేసింది. తక్కువ ఇన్నింగ్స్‌లలో 3,000 పరుగుల మైలురాయిని చేరుకోవడంలో క్రిస్ గేల్, కేఎల్‌ రాహుల్, జోస్ బట్లర్ వంటి వారి స‌ర‌స‌న నిలిపింది. గిల్ ఐపీఎల్‌లో రాణించడమే కాకుండా, దేశం త‌ర‌ఫున ఆడే సిరీస్‌ల‌లో సైతం అద్భుత‌మైన ఆట‌తో తాజాగా 4వేల టీ20 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. 

ఇక 2022లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ త‌ర‌ఫున అరంగేట్రం చేసిన అతను ఆ జ‌ట్టుకు కీల‌క ఆట‌గాడిగా మారాడు. ఇప్ప‌టివ‌ర‌కు జీటీ త‌ర‌ఫున గిల్ 1,500 ప‌రుగులు చేశాడు. గుజ‌రాత్ జ‌ట్టు విజయానికి కీలకమైన ఇన్నింగ్స్‌లు, మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో దూసుకెళ్తున్నాడు. ఇక‌ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు వెళ్ల‌డంతో ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు కూడా స్వీకరించాడు.

More Telugu News