IPL 2024: ఉత్కంఠ పోరులో గుజ‌రాత్ అనూహ్య విజ‌యం.. సొంత మైదానంలో కంగుతిన్న రాజ‌స్థాన్‌!

  • జైపూర్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ గుజ‌రాత్ టైటాన్స్‌
  • ఆఖ‌రి బంతికి విజ‌యాన్ని సాధించిన గుజ‌రాత్‌
  • హాఫ్ సెంచ‌రీ (72) తో మెరిసిన‌ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌
  • చివ‌ర‌లో ర‌షీద్, తెవాటియా అద్భుత పోరాటం
  • రియాన్ ప‌రాగ్‌, సంజు శాంస‌న్ శ్ర‌మ వృథా
  • రాజ‌స్థాన్ వ‌రుస‌ విజ‌యాల‌కు బ్రేక్‌
Rashid Khan stars as Gujarat beat Rajasthan in a thriller

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బుధ‌వారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై గుజ‌రాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. 197 ప‌రుగుల భారీ ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ ఆఖ‌రి బంతికి టార్గెట్‌ను అందుకుంది. జీటీ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ హాఫ్ సెంచ‌రీ (72), సుద‌ర్శ‌న్ (35) ప‌రుగుల‌తో రాణించారు. చివ‌ర‌లో ర‌షీద్ ఖాన్ (24 నాటౌట్‌), రాహుల్ తెవాటియా (22) అద్భుత‌మైన పోరాటంతో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. 

అంత‌కుముందు టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్‌కు రియాన్ ప‌రాగ్ (76), కెప్టెన్ సంజు శాంస‌న్ (68 నాటౌట్‌) అర్ధ శ‌త‌కాల‌తో 196 ప‌రుగుల భారీ స్కోర్ అందించారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 196 ప‌రుగులు చేసింది. ఈ ద్వ‌యం 78 బంతుల్లోనే 130 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించ‌డం విశేషం. కాగా, రాజ‌స్థాన్ ఓపెన్ల‌రు య‌శ‌స్వీ జైస్వాల్ (24), బ‌ట్ల‌ర్ (08) మ‌రోసారి నిరాశ‌ప‌రిచారు. దీంతో ప‌వ‌ర్ ప్లే ముగిసేస‌రికి ఆర్ఆర్ 2 వికెట్లు కోల్పోయి 43 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 

ఆ త‌ర్వాత రియాన్, శాంస‌న్ బ్యాట్ నుంచి పెద్ద‌గా ప‌రుగులు రాలేదు. అదే స‌మ‌యంలో వికెట్లు ప‌డకుండా సింగిల్స్‌తో స్కోర్ బోర్డును ముందుకు న‌డిపారు. దీంతో 12 ఓవ‌ర్లు పూర్త‌యిన త‌ర్వాత రాజ‌స్థాన్ స్కోర్ కేవ‌లం 89 ప‌రుగులే. కానీ, ఆ త‌ర్వాత క్రీజులో కుదురుకున్న రియాన్ ప‌రాగ్‌, సంజు శాంస‌న్ గేరు మార్చ‌డంతో స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్టింది. ఇద్ద‌రు బ్యాట‌ర్లు ఫోర్లు, సిక్స‌ర్ల‌తో గుజ‌రాత్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. 

ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రూ హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేసుకున్నారు. ఇలా జోడీ జోరు కార‌ణంగా రాజ‌స్థాన్ ఆఖ‌రి 10 ఓవ‌ర్ల‌లో 123 ప‌రుగులు చేయ‌డం విశేషం. దీంతో 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఆర్ఆర్ 3 వికెట్లు కోల్పోయి 196 ర‌న్స్  చేసింది. గుజ‌రాత్ ముందు 197 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ఉమేశ్ యాద‌వ్‌, మోహిత్ శ‌ర్మ‌, ర‌షీద్ ఖాన్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం 197 ప‌రుగుల భారీ లక్ష్య‌ఛేద‌న‌తో బ్యాటింగ్ ఆరంభించిన గుజ‌రాత్ ప్రారంభంలో బాగానే ఆడింది. 8 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 64 ప‌రుగులు చేసింది. కానీ, ఆ త‌ర్వాత రాజ‌స్థాన్ బౌల‌ర్ కుల్‌దీప్ సేన్ జీటీని దెబ్బ తీశాడు. అత‌ని ధాటికి గుజ‌రాత్ 11 ఓవర్ల‌కు 3 వికెట్లు కోల్పోయి కేవ‌లం 83 ప‌రుగులే చేసింది. గుజ‌రాత్ కేవ‌లం 15 ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే 3 వికెట్లు పారేసుకుంది. ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ 29 బంతుల్లో 35 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఒక‌వైపు వికెట్లు ప‌డుతున్న కెప్టెన్ గిల్ బ్యాట్ నుంచి ప‌రుగులు రావ‌డం ఆగలేదు. గిల్ 44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 72 ప‌రుగులు చేసి జ‌ట్టును ముందుండి న‌డిపించాడు. 

గుజ‌రాత్‌కు విజ‌యానికి చివ‌రి 4 ఓవ‌ర్ల‌లో 86 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. క్రీజులో గిల్‌, తెవాటియా ఉన్నారు. దాంతో టైటాన్స్ విజ‌యంపై న‌మ్మ‌కంగానే ఉంది. అందుకు త‌గ్గ‌ట్టే సార‌ధి గిల్ ఒకే ఓవ‌ర్‌లో 4 బౌండ‌రీలు బాదాడు. అదే ఊపులో మ‌రో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి స్పిన్న‌ర్ చాహ‌ల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. ఆ త‌ర్వాత షారూక్ ఖాన్‌, తెవాటియా.. అశ్విన్ వేసిన‌ 17 ఓవ‌ర్‌లో ఏకంగా 17 ప‌రుగులు రాబ‌ట్టారు. కానీ, 18వ‌ ఓవ‌ర్‌లో గుజ‌రాత్ షారుక్ వికెట్‌ను కోల్పోయి కేవ‌లం 7 ప‌రుగులే చేసింది. దీంతో ఆఖ‌రి రెండు ఓవ‌ర్ల‌లో టైటాన్స్‌కు 35 రన్స్ కావాల్సి వ‌చ్చింది. 19 ఓవ‌ర్ వేసిన కుల్దీప్ సేన్ ఆర్ఆర్ కొంప‌ముంచాడు. 

ఈ ఒక్క ఓవ‌ర్‌లోనే జీటీకి 20 ప‌రుగులు ఇచ్చుకున్నాడు. ఈ ఓవ‌ర్‌లో తెవాటియా 2 బౌండ‌రీలు కొడితే, ర‌హీద్ ఖాన్ ఒక ఫోర్ బాదాడు. దాంతో స‌మీక‌ర‌ణం 6 బంతుల్లో 15 ప‌రుగుల‌కు మారింది. ఆఖ‌రి ఓవ‌ర్ అవేశ్ ఖాన్ వేశాడు. తొలి నాలుగు బంతుల్లో ర‌షీద్ 11 (4, 2, 4, 1) రన్స్ చేశాడు. ఐదో బంతికి మూడో ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించి తెవాటియా రనౌట్ అయ్యాడు. ఇక చివ‌రి బంతికి గుజ‌రాత్ విజ‌యానికి 2 ప‌రుగులు కావాల్సి ఉండ‌గా.. ర‌షీద్ ఖాన్ బౌండ‌రీ కొట్ట‌డంతో టైటాన్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. 

రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో కుల్దీప్ సేన్ 3 వికెట్లు తీయ‌గా.. చాహ‌ల్ 2, అవేశ్ ఖాన్ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. ఈ ప‌రాజ‌యంతో ఆర్ఆర్ వ‌రుస విజ‌యాల‌కు బ్రేక్ ప‌డింది. ఇప్ప‌టివ‌ర‌కు 5 మ్యాచులు ఆడిన రాజ‌స్థాన్ 4 విజ‌యాలు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉంది. ఇక శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ ఆరు మ్యాచుల్లో 3 విజ‌యాలు, 3 ఓట‌ముల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది.

More Telugu News