Seethakka: కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలను విమర్శించే నైతిక అర్హత బీఆర్ఎస్ కు లేదు: మంత్రి సీతక్క

  • భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావుపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్న మంత్రి
  • రేగా కాంతారావును కాంగ్రెస్ రెండుసార్లు గెలిపిస్తే బీఆర్ఎస్‌లోకి వెళ్లారని ఆగ్రహం
  • కాంగ్రెస్ కట్టించిన కార్యాలయానికి రేగా కాంతారావు బీఆర్ఎస్ అని బోర్డు పెట్టుకున్నారని బలరాం ఆగ్రహం
Minister Seethakka questions about party changing

నాడు అభివృద్ధి కోసం బీఆర్ఎస్‌లోకి వెళ్లినవారు... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదే అభివృద్ధి కోసం మావైపు వస్తారా? అని తాను ఆ రోజే అడిగానని మంత్రి సీతక్క ప్రశ్నించారు. వారు అభివృద్ధి కోసం అప్పుడు ఆ పార్టీలో చేరితే... ఇప్పుడు అందుకోసమే తమ వైపు వస్తున్నారన్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకొని దానికి అభివృద్ధి కోసం అని పేరు పెట్టిందే బీఆర్ఎస్ అని విమర్శించారు.

ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై విమర్శలు చేసే నైతిక హక్కు బీఆర్ఎస్ వారికి లేదన్నారు. పినపాక మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారన్నారు. ఆయనను రెండుసార్లు గెలిపిస్తే... అదే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్‌లోకి వెళ్లినప్పుడు అభివృద్ధి కోసం వెళ్లినట్లు చెప్పారని, మరి ఇప్పుడు మా వైపు వచ్చే వారు కూడా అందుకే వస్తున్నట్లు కదా అన్నారు. వారు చేస్తే నీతి... ఇతరులు చేస్తే రోత అవుతుందా? అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు.

రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ కట్టించిన కార్యాలయానికి బీఆర్ఎస్ కార్యాలయం అని పేరు పెట్టుకున్నారని... అందుకు సిగ్గుండాలని బలరాం నాయక్ మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్ ఇంట్లో ఉంటూ బీఆర్ఎస్ బోర్డు పెట్టుకోవడం విడ్డూరమన్నారు. అది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమేనని తెలుసుకోవాలన్నారు. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకొని మాట్లాడాలన్నారు.

More Telugu News