Bogus Votes: తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంపై సీఈవోకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

  • గత ఉప ఎన్నిక సమయంలో తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు
  • ఇదే అంశాన్ని సీఈవో దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేతలు
  • అప్పటి ఆర్వోను సస్పెండ్ చేసినా, జాబితాలో దొంగ ఓట్లను తొలగించలేదని వెల్లడి
  • 2024 ఓటరు జాబితాలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు 
BJP leaders met CEO and complains against bogus votes in Tirupati

గతంలో తిరుపతి ఉప ఎన్నిక సమయంలో భారీ ఎత్తున దొంగ ఓట్ల కలకలం రేగడం తెలిసిందే. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పించి అక్రమాలకు కుట్ర పన్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. 

దీనిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి స్పందించారు. తిరుపతిలో 36 వేల దొంగ ఓట్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. దొంగ ఓట్ల వ్యవహారంలో నాటి ఆర్వో గిరీషాను సస్పెండ్ చేశారని వెల్లడించారు. కానీ ఆ దొంగ ఓట్లను మాత్రం జాబితా నుంచి తొలగించలేదని తెలిపారు. 

ఓటరు జాబితాలో ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని సీఈవోను కోరామని భానుప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. 2024 ఓటర్ల జాబితాలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని, ఈ మేరకు సీఈవోకు ఆధారాలు అందించామని తెలిపారు. దొంగ ఓట్లతో ప్రమేయం ఉన్న నేతలపై అనర్హత వేటు వేయాలని కోరామని చెప్పారు.

More Telugu News