Pawan Kalyan: పోలవరం అయిందా అని అడిగితే... ఆ మంత్రి డ్యాన్సులు చేస్తాడు: తణుకులో పవన్ కల్యాణ్

  • తణుకులో ప్రజాగళం సభ
  • హాజరైన పవన్ కల్యాణ్, చంద్రబాబు
  • తనదైన శైలిలో ప్రసంగించిన జనసేనాని
Pawan Kalyan speech in Tanuku

నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు... నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు... ఇది రాసింది మన మండపాక పంచాయతీలో పుట్టిన దేవరకొండ బాలగంగాధర తిలక్ అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ తణుకు ప్రజాగళం సభలో ప్రసంగం ప్రారంభించారు. 

బాపు వంటి ఒక గొప్పచిత్రకారుడు కూడా తణుకులో పుట్టారని వెల్లడించారు. నన్నయ ఇక్కడే యజ్ఞయాగాదులు చేసి భారతానికి శ్రీకారం చుట్టిన నేల ఇది... ఇస్రో రాకెట్లకు ఇంధనం అందిస్తున్న నేల ఇది... ఎంతో పురోభివృద్ధి ఉన్న నేల ఇది... అలాంటి నేల వైసీపీ పాలనలో కరప్షన్ క్యాపిటల్ గా మారిపోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక్కడ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉన్నారని, ఓ రైతు ధాన్యం తడిసిపోయిందని అడిగితే, ఆ మంత్రి ఎంతో ఛీత్కారంగా మాట్లాడారని పవన్ ఆరోపించారు. ఈ ఎన్నికలతో ఆ మంత్రి సర్వం తుడిచిపెట్టుకుపోవాలని అన్నారు. 

"పదేళ్లుగా నేను పార్టీ పెట్టి యువత భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నాను. మరోవైపు, 2047 నాటికి దేశం భవిష్యత్ ఇలా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు. ఇక, బలమైన నాయకుడు, ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, 90వ దశకం చివర్లో విజన్ 2020 పేరిట ఒక సైబరాబాద్ పేరిట ఐటీ సిటీని రూపుదిద్దిన వ్యక్తి చంద్రబాబు. ఇవాళ తెలంగాణకు అదే అభివృద్ధి కేంద్రంగా నిలిచింది. 

పార్టీలు కలిసుండాలి, లేకపోతే రాష్ట్రం అన్యాయం అయిపోతుందని 2014 నుంచి చెబుతున్నాం. పోలవరం అయిందా అని అడిగితే ఆ ఇరిగేషన్ మంత్రి ఓలమ్మీ తిక్కరేగిందా, ఓలమ్మీ తిమ్మిరెక్కిందా అంటూ డ్యాన్సులు చేస్తున్నాడు. ఇలాంటి పాటలకు అతడు డ్యాన్సులు ప్రాక్టీసు చేస్తుంటాడు. పోలవరం పునరావాసం గురించి చెప్పమంటే... అబ్బనీ తియ్యని దెబ్బ అంటూ మరో పాట ఎత్తుకుంటాడు. బూతులు తిట్టేవాళ్లు, డ్యాన్సులు చేసేవాళ్లు, దాడులు చేసేవాళ్లు వైసీపీ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. 

ఇవాళ చప్పట్లు కొట్టించుకోవడానికి ఇక్కడికి రాలేదు... మీకోసం మేం ఉన్నాం అని చెప్పడానికి వచ్చాం... మీ కోసం మేమెంతో తగ్గాం. చంద్రబాబు గారు ఎంతో తగ్గారు.. నేను కూడా తగ్గాను. ముఖ్యంగా జనసేన పార్టీ ఎంతో తగ్గింది. తణుకులో జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా మేం తగ్గాల్సి వచ్చింది... ఓటు చీలకూడదన్నదే ప్రధాన కారణం. మా అన్నయ్య నాగబాబు అనకాపల్లి సీటును కూడా వదులుకున్నారు... ఇదంతా ఆడబిడ్డల భద్రత కోసం, రైతన్నల క్షేమం కోసం, కనీస వైద్య సదుపాయాల కోసం. దోపిడీ మీద దృష్టి ఉన్న వాడు ప్రజావసరాల గురించి ఏం పట్టించుకుంటాడు? 

చంద్రబాబుతో, ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించి ఈ కూటమిని తీసుకువచ్చాం. నాకు అధికారం లేకపోయినా, చంద్రబాబుకు అధికారం లేకపోయినా మాకు నష్టం లేదు. కానీ జగన్ ఐదేళ్ల పాటు డీఎస్పీ ఇవ్వలేదు. అలాంటి పాలకులు అధికారంలో ఉంటే ఎవరికీ భవిష్యత్ ఉండదు" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

More Telugu News