Balka Suman: రేవంత్ రెడ్డి రెండు పడవలపై కాలు పెట్టారు... బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం అలా చేస్తున్నారు: బాల్క సుమన్

  • అసెంబ్లీ ఎన్నికల సమయంలో బడేబాయ్ మోదీ... చోటేబాయ్ రేవంత్ రెడ్డికి సహకరించారని ఆరోపణ
  • బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని విమర్శ
  • రేవంత్ రెడ్డికి ఢిల్లీలో అపాయింటుమెంట్లు ఇప్పించిందే కిషన్ రెడ్డి అని వ్యాఖ్య
Balka Suman fires at Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతూ పాడుతూ రెండు పడవలపై కాలు పెట్టి ప్రయాణం సాగిస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కాంగ్రెస్ బలహీనమైన వారిని బరిలోకి దింపుతోందని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బడేబాయ్ మోదీ... చోటేబాయ్ రేవంత్ రెడ్డికి సహకరించారని ఆరోపించారు. అందుకే నాడు రైతుబంధు ఆపేయాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేయగానే ఎన్నికల సంఘం వారికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిందని, అధికారుల మీదనో... కలెక్టర్ మీదనో ఫిర్యాదు చేయగానే వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి సహకరించిందనేది నిర్వివాద అంశమన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ వాళ్లు గెలిచేందుకు సహకరిస్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలు, మీడియా ఓసారి ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా బలమైన అభ్యర్థిని బరిలో నిలపలేదన్నారు. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించడానికి రంజిత్ రెడ్డిని, మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్‌ను గెలిపించేందుకు బలహీనమైన అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని, సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డిని గెలిపించేందుకు మా పార్టీ నుంచి తీసుకువెళ్లిన దానం నాగేందర్‌ను పోటీలో నిలిపారన్నారు. అసలు దానం ప్రచారమే చేయడం లేదన్నారు. ఆయన ఐపీఎల్ మ్యాచ్‌లు చూసుకుంటూ ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. అప్పుడప్పుడు బయటకు వచ్చి ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. 

మెదక్‌లో రఘునందన్ రావును గెలిపించేందుకు నీలం మధుకు టిక్కెట్ ఇచ్చారన్నారు. రఘునందన్, రేవంత్ రెడ్డి చాలా సన్నిహితులు అని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి సుగుణను బరిలోకి దింపారని... ఆమె ఎవరికీ తెలియదన్నారు. ఇక కరీంనగర్‌లో బండి సంజయ్ పైన ఇప్పటి వరకు ఎవరి పేరునూ ప్రకటించలేదన్నారు. బండి సంజయ్ ఇంకా కాంగ్రెస్ నేతలకు పేరు ఇవ్వనట్లుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అక్కడ కూడా బలంలేని అభ్యర్థిని బరిలోకి దింపడం ఖాయమని మండిపడ్డారు. ప్రతిచోట బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను నిలిపిందన్నారు.

రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి పెద్దన్న అని విమర్శించారు. గతంలో రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, అమిత్ షా సహా కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ ఇప్పించిందే కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని... అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. అంతకుముందు రెఫరెండం అని చెప్పిన రేవంత్ కొడంగల్‌లో మాట మార్చి కుట్రలు అంటూ మాట్లాడటం విడ్డూరమన్నారు. కానీ అసలు కుట్రదారు రేవంత్ రెడ్డియే అన్నారు.

More Telugu News