Maheshwar Reddy: చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు పోలికలు ఉన్నాయి: బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి

  • రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు 25 మంది ఉన్నారన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • బీఆర్ఎస్ నుంచి మరికొంతమందిని తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్య
  • కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కంఫర్ట్‌గా లేరని వ్యాఖ్య
Maheshwar Reddy satires on revanth reddy

టీడీపీ అధినేత చంద్రబాబుకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పోలికలు ఉన్నాయని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ పేరుతో మూడు గ్రూప్‌లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు 25 మంది ఉన్నారని... వారికి మరికొంతమందిని బీఆర్ఎస్ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్‌గా లేరని, సొంత దుకాణం కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సీఎం చెబుతున్నారని.. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని చెబుతున్నారన్నారు. పీసీసీ పదవి వేరే... సీఎం పదవి వేరే అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. సీఎం పదవి కోసం పదిమంది పోటీపడుతున్నారన్నారు. భట్టి బీ ట్యాక్స్‌ అని కాంగ్రెస్‌ వాళ్లే లీకులు ఇచ్చారని విమర్శించారు.

రేవంత్ రెడ్డి తన వర్గానికి తోడు బీఆర్ఎస్ నేతలను తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని... అదే సమయంలో 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని అందరూ గమనించాలన్నారు. సీఎం స్థాయిలో ఉండి కుట్ర చేస్తున్నారనడం రేవంత్‌ అసమర్థతకు నిదర్శనమన్నారు. గేట్లు ఓపెన్ చేసినా... కిటికీలు తెరిచినా తమ పార్టీ నుంచి ఎవరూ కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదన్నారు. గేట్లు ఎత్తామని చెబుతున్నారు కదా... ఎమ్మెల్యేలు ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. తాము గేట్లు ఎత్తాల్సిన అవసరం లేదని.. ఉప ఎన్నికలు వస్తే చాలన్నారు.

కాంగ్రెస్‌ను ఎవరూ ఏమీ చేయాల్సిన అవసరం లేదని.. వాళ్ల మధ్య విభేదాలే వాళ్లను బలహీనం చేస్తాయన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరితోనూ టచ్‌లో లేరన్నారు. బీజేపీ ప్రజలను మాత్రమే నమ్ముకుందన్నారు. కాంగ్రెస్‌లో వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారని... ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ముఖ్యమంత్రి వెంట భారీ వ్యవస్థ ఉన్నప్పటికీ కుట్ర జరుగుతుందని చెప్పడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్‌లో ఐదుగురు షిండేలు ఉన్నారన్నారు.

రేవంత్ రెడ్డి ప్లాన్ 'ఏ' ఏమిటంటే.. పార్టీలో ఉంటే తన వెంట ఎంత మంది వస్తారు ? ప్లాన్ 'బీ' ఏమిటంటే.. పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా దుకాణం పెట్టుకుంటే ఎంతమంది వస్తారు? అని లెక్కలు వేసుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి టెన్షన్ తట్టుకొలేక ఓ ఐపీఎస్‌ అధికారి గుండెపోటుతో మరణించారని ఆరోపించారు.

More Telugu News