IPL 2024: నితీశ్ రెడ్డి ఓ అద్భుతం.. తెలుగు కుర్రాడిపై క‌మిన్స్ ప్ర‌శంస‌ల జ‌ల్లు!

  • పంజాబ్‌పై గెలుపులో కీల‌క పాత్ర నితీశ్ రెడ్డిదేన‌న్న క‌మిన్స్‌
  • రాబోయే రోజుల్లో జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా ఎదుగుతాడ‌ని కితాబు
  • ఆంధ్రా ఆట‌గాడి ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగానే విజ‌యం సాధ్య‌మైందంటూ ప్ర‌శంస‌లు
SRH captain Pat Cummins praises Nitish Kumar Reddy heroics

ఐపీఎల్‌లో మంగళవారం మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించిన‌ విష‌యం తెలిసిందే. 20 ఏళ్ల నితీశ్‌ రెడ్డి 37 బంతుల్లో 64 పరుగులతో (4ఫోర్లు, 5 సిక్స‌ర్లు) అద్భుతంగా రాణించడంతో పాటు బంతితో కూడా ఆక‌ట్టుకున్నాడు.  64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ప‌డిన‌ జట్టును అర్ధశతకంతో సత్తాచాటి పంజా‌బ్‌ ముందు మంచి లక్ష్యాన్ని ఉంచాడు. చివ‌రికి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కించుకున్నాడు.

ఈ సంద‌ర్భంగా మ్యాచ్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన‌ యువ సంచ‌ల‌నం నితీశ్ కుమార్‌ రెడ్డిపై ఎస్ఆర్‌హెచ్‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు కురిపించాడు. రెడ్డి ఆటతీరును కొనియాడిన క‌మిన్స్‌.. ఆంధ్రా ఆట‌గాడు త‌న ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో మ్యాచ్‌పై తీవ్ర ప్ర‌భావం చూపించాడ‌న్నాడు. 

"నితీశ్ రెడ్డి ఓ అద్భుతమైన ఆటగాడు. ఫీల్డ్‌లో అద్భుతంగా ఉన్నాడు. మూడు ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. అతని అద్భుత‌మైన బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌ కార‌ణంగా మేము 180 పరుగుల మార్క్‌ను అందుకున్నాం. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్‌తో గెలుపులో కీలక పాత్ర పోషించాడు" అని కమిన్స్ వ్యాఖ్యానించాడు. ఈ సంద‌ర్భంగా స‌న్‌రైజ‌ర్స్ విజయంలో నితీశ్‌ రెడ్డి కీలక పాత్రను కెప్టెన్‌ నొక్కి చెప్పాడు. 

"మ్యాచ్ గొప్పగా సాగింది. పంజాబ్ బంతితో సత్తాచాటి శుభారంభం చేసింది. అయినా మేం 182 పరుగులు సాధించగలిగాం. పంజాబ్ కూడా లక్ష్యానికి చేరువగా వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల కలిసొచ్చేది ఇదే. బ్యాటింగ్ ఆర్డర్ లోతుగా ఉంటుంది. అయితే కొత్త బంతితో వాళ్లు విజృంభించారు. 150-160 పరుగులు సాధిస్తే పది మ్యాచ్‌ల్లో తొమ్మిది మ్యాచ్‌లను కాపాడుకోవడం అసాధ్యమే. అందుకే దూకుడుగా ఆడాం" అని క‌మిన్స్ చెప్పుకొచ్చాడు.

More Telugu News