SRH: పంజాబ్ తో హోరాహోరీ... రెండు పరుగుల తేడాతో గట్టెక్కిన సన్ రైజర్స్

  • ముల్లన్ పూర్ లో నువ్వానేనా అన్నట్టు పోరాడిన సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్
  • 183 పరుగుల లక్ష్యఛేదనలో 180 పరుగులు చేసిన పంజాబ్
  • సన్ రైజర్స్ ను భయపెట్టిన శశాంక్ సింగ్
  • చివరికి సన్ రైజర్స్ దే విజయం
SRH edges PBKS by 2 runs in thrilling match

ఐపీఎల్ లో మరో సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్ ఆవిష్కృతమైంది. ముల్లన్ పూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో విజయం కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ హోరాహోరీగా పోరాడాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ రెండు పరుగుల తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. 

183 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ జట్టు చివరికి 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 29 పరుగులు అవసరం కాగా, అశుతోష్ శర్మ రెండు సిక్స్ లతో పరిస్థితిని మార్చేశాడు. దానికి తోడు ఉనద్కట్ వైడ్ లు వేయడంతో పంజాబ్ గెలుస్తుందేమో అనిపించింది. 

అయితే, ఆ ఓవర్లో ఉనద్కట్ కొన్ని స్లో డెలివరీలు వేయగా, వాటిని బౌండరీ దాటించడంలో పంజాబ్ బ్యాటర్లు విఫలమయ్యారు. చివరి రెండు బంతుల్లో 11 పరుగులు కొట్టాల్సిన పరిస్థితిలోనూ ఉనద్కట్ ఓ వైడ్ బాల్ వేసి సన్ రైజర్స్ శిబిరంలో కంగారు పుట్టించాడు. అయితే ఆ తర్వాతి బంతికి సింగిల్ రావడంతో, చివరి బంతికి 9 పరుగులు కొట్టాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని శశాంక్ సింగ్ సిక్స్ కొట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు సన్ రైజర్స్ గట్టెక్కింది. 

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫీల్డర్లు పలు క్యాచ్ లు వదిలేయడం ప్రతికూలంగా మారింది. పంజాబ్ ఇన్నింగ్స్ లో శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ మరో రేంజ్ లో సాగింది. వేలంలో ఒక ఆటగాడ్ని కొనుగోలు చేయబోయిన పంజాబ్ కింగ్స్ పొరపాటున శశాంక్ సింగ్ ను కొనుగోలు చేసింది. ఇప్పుడా ఆటగాడే పంజాబ్ కు ఆపద్బాంధవుడు అయ్యాడు. 

గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో 29 బంతుల్లో 61 పరుగులు చేసి పంజాబ్ ను గెలిపించిన శశాంక్ సింగ్ ఇవాళ కూడా ఎదురుదాడికి దిగాడు. 25 బంతుల్లో 46 పరుగులు చేసి, దాదాపు పంజాబ్ ను గెలిపించినంత పనిచేశాడు. మరో ఎండ్ లో అశుతోష్ శర్మ 15 బంతుల్లో 33 పరుగులు చేసి సన్ రైజర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. 

వికెట్ కీపర్ జితేశ్ శర్మ 19, శామ్ కరన్ 29, సికిందర్ రజా 28 పరుగులు చేశారు. అంతకుముందు, కెప్టెన్ శిఖర్ ధావన్ (14), జానీ బెయిర్ స్టో (0), ప్రభ్ సిమ్రన్ సింగ్ (4) విఫలమయ్యారు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, కమిన్స్ 1, నటరాజన్ 1, నితీశ్ రెడ్డి 1, ఉనద్కట్ 1 వికెట్ తీశారు. 

సన్ రైజర్స్ తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 15న  రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.

More Telugu News