Mantena Ramaraju: కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు

  • ఉండి టికెట్ మరొకరికి ఇస్తున్నారనే అర్థం వచ్చేలా మంతెన రామరాజు వ్యాఖ్యలు
  • పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం అని వెల్లడి
  • రాజకీయ భవిష్యత్ గురించి కుటుంబసభ్యులతో మాట్లాడానన్న రామరాజు
Undi TDP MLA Mantena Ramaraju held meeting with supporters

ఉండి అసెంబ్లీ స్థానంలో అభ్యర్థి మార్పు తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు వ్యాఖ్యలు వింటే, ఉండి టికెట్ మరొకరికి ఇస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఇటీవల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరగా, ఆయనను ఉండి నుంచి అసెంబ్లీ బరిలో దించనున్నారని ప్రచారం జరిగింది. ఉండి విషయంలో చంద్రబాబు తనకేమీ హామీ ఇవ్వలేదని రఘురామ స్వయంగా చెప్పడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. 

అయితే, ఉండి ఎమ్మెల్యే రామరాజు తాజాగా కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టికెట్ మరొకరికి ఇస్తున్నారని, తనకు అన్యాయం జరుగుతోందని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

"పార్టీ ఆఫీసులో ఒక ఉద్యోగి ఫోన్ చేసి చెప్పినా సరే పార్టీ ఆదేశం అని భావించి కష్టపడి పనిచేశాను. పార్టీ ఏ పని అప్పగిస్తే ఆ పని చేశాను. ఇప్పుడు పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే నాకు చాలా బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగాలా, లేక విరమించుకోవాలా? అని కుటుంబ సభ్యులను కూడా అడిగాను" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దశలో ఆయన భావోద్వేగాలకు గురై మాట్లాడలేకపోయారు. 

ఉండి టికెట్ మరొకరికి ఇస్తున్నారన్న సంకేతాలు పార్టీ నుంచి అందిన కారణంగానే రామరాజు ఈ విధంగా మాట్లాడి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

More Telugu News