Perni Nani: వాలంటీర్ల పారితోషికం రూ.10 వేలకు పెంచుతామన్న చంద్రబాబు హామీపై పేర్ని నాని స్పందన

  • కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రెట్టింపు పారితోషికం ఇస్తామన్న చంద్రబాబు
  • వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు నాశనం చేయాలని భావించారన్న పేర్ని నాని
  • కుదరకపోయేసరికి కల్లబొల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నాడని విమర్శలు
Perni Nani reaction on Chandrababu assurance towards volunteers

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల పారితోషికాన్ని రూ.10 వేలకు పెంచుతామని ఇవాళ ఉగాది సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు ప్రస్తుతం రూ.5 వేల పారితోషికం అందుకుంటుండగా, అంతకు రెట్టింపు ఇస్తామని చంద్రబాబు నేడు వెల్లడించారు. 

దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రజలకు గాలం వేసి, వారిని వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేయాలని చంద్రబాబు భావించారని, అది కుదరకపోయేసరికి ఇప్పుడు వారిపై కల్లబొల్లి ప్రేమ ఒలకబోస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. 

వాలంటీర్ల విషయంలో ప్రజల్లో తిరుగుబాటు రావడంతో చంద్రబాబు పంథా మార్చారని అన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మరని, ప్రజాసేవ కోసం పనిచేసే వాలంటీర్లు చంద్రబాబు విసిరిన గాలానికి చిక్కుకోరని పేర్ని నాని స్పష్టం చేశారు. 

ఓవైపు నిమ్మగడ్డ రమేశ్ తో వాలంటీర్లపై ఫిర్యాదులు చేయించింది చంద్రబాబేనని, ఇప్పుడదే చంద్రబాబు వాలంటీర్ల అంశంలో నీతి వాక్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.

More Telugu News