Ola: బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో దుకాణం మూసేసి భారత్ పైనే దృష్టి కేంద్రీకరించనున్న ఓలా

  • గత రెండేళ్లుగా నష్టాల్లో ఓలా
  • భారత్ లో వ్యాపార విస్తరణకు అపార అవకాశాలున్నాయన్న ఏఎన్ఐ టెక్నాలజీస్
  • క్యాబ్ సేవల్లో భారత్ లో ఇప్పటికీ తామే నెంబర్ వన్ అని వెల్లడి
Ola decides to shut down oversees business ops

క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్  దేశాల్లో ఓలా తన కార్యకలాపాలు మూసివేయనుంది. ఇకపై భారత్ లోని తన వ్యాపారంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓలా సంస్థ ప్రమోటర్ ఏఎన్ఐ టెక్నాలజీస్ వెల్లడించింది. 

భారత్ లో వ్యాపార విస్తరణకు అపారమైన అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. తమ వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోందని, తాము ఇప్పటికీ క్యాబ్ సర్వీసుల రంగంలో భారత్ లో నెంబర్ వన్ గా ఉన్నామని, తమ లాభాల పరంపర కొనసాగుతోందని స్పష్టం చేసింది. 

ఇక భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదేనని, కేవలం వ్యక్తిగత రవాణాలోనే కాకుండా క్యాబ్ సర్వీసుల రంగంలోనూ విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యత కనిపిస్తోందని ఏఎన్ఐ టెక్నాలజీస్ పేర్కొంది. 

గత రెండేళ్లుగా ఓలా ప్రమోటర్ ఏఎన్ఐ టెక్నాలజీస్ నష్టాలు నమోదు చేస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ రూ.1082.56 కోట్ల నష్టం చవిచూడగా, 2022లో రూ.3,082.42 కోట్ల మేర నష్టాలు ఎదుర్కొంది. నష్టాల బాట నుంచి బయటికి వచ్చేందుకే బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో తన వ్యాపారాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.

More Telugu News