Lok Sabha Election 2024: లోక్‌సభ తొలి దశలో పోటీ చేస్తున్న నేరచరితుల్లో అత్యధికులు బీజేపీలోనే!

  • బీజేపీ అభ్యర్థుల్లో 28 మందిపై క్రిమినల్ కేసులు
  • కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో 19 మంది క్రిమినల్ అభ్యర్థులు
  • ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఏడీఆర్ రిపోర్ట్
Parties with candidates having most number of criminal cases in Lok Sabha Election 2024

లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరచరితుల్లో అత్యధికులు బీజేపీలో ఉన్నారని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. మొదటి దశలో పోటీ చేస్తున్న వారిలో 16 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఈ మేరకు భారత ఎన్నికల సంఘానికి తెలియజేశారని తెలిపింది. తొలి దశ బరిలో 1,618 మంది అభ్యర్థులు ఉండగా అందులో 252 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా ప్రకటించారని వివరించింది. నేరచరితుల్లో 161 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది.

అత్యధికంగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న 28 మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. కాంగ్రెస్ నుంచి 19 మంది, ఏఐఏడీఎంకే తరపున 13 మంది, డీఎంకే నుంచి 13 మంది, సీపీఐ తరపున ఇద్దరు, సీపీఎం తరపున పోటీ చేస్తున్న ముగ్గురిపై కేసులు ఉన్నాయని తెలిపింది. ఇక ఆప్, శివసేన, ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీల నుంచి ఒక్కొక్కరు నేరచరితులు పోటీ చేస్తున్నట్టు పేర్కొంది.

కేసులు ఇవే..
15 మంది అభ్యర్థులు తాము దోషులుగా తేలినట్టు తమ అఫిడవిట్‌లలో ప్రకటించారు. ఏడుగురు అభ్యర్థులు తమపై హత్య (ఐపీసీ సెక్షన్ -302) కేసులు ఉన్నట్టు ప్రకటించారు. 19 మందిపై హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్ 307) కేసులు నమోదయాయి. మహిళలపై నేరాలకు సంబంధించి 18 మందిపై కేసులు ఉన్నట్టు అఫిడవిట్‌ల ద్వారా తెలిసింది. వీరిలో ఒకరిపై అత్యాచారం కేసు ఉంది. ఇక అత్యధికంగా 35 మంది అభ్యర్థులపై విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. కాగా క్రిమినల్ కేసులున్న అభ్యర్థులను ఎంపిక చేయడానికి గల కారణాలను చెప్పాలని 2020లో రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే.

More Telugu News