SRH: నేడు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్... టాస్ ఓడిన సన్ రైజర్స్

  • ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ × పంజాబ్ కింగ్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ 
  • ముల్లన్ పూర్ లో మ్యాచ్
SRH faces Punjab Kings in Mullanpur

సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ పంజాబ్ కింగ్స్ ను ఢీకొంటోంది. ఈ మ్యాచ్ కు ముల్లన్ పూర్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. 

ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు లేవని సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్  కమిన్స్ వెల్లడించాడు. గత మ్యాచ్ లో సీఎస్కేపై నెగ్గిన జట్టుతోనే బరిలో దిగుతున్నామని తెలిపాడు. అటు, పంజాబ్ కింగ్స్ జట్టులోనూ మార్పులేవీ లేవు. 

టోర్నీలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్ లను పరిశీలిస్తే... పాయింట్ల పరంగా సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ సమవుజ్జీలుగా ఉన్నాయి. సన్ రైజర్స్ 4 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు సాధించగా... పంజాబ్ కూడా 4 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు నమోదు చేసింది. 

అయితే, సన్ రైజర్స్ (+0.409) మెరుగైన రన్ రేట్ కారణంగా ఐదో స్థానంలో ఉండగా, పంజాబ్ (-0.220) ఆరో స్థానంలో కొనసాగుతోంది. 

ఇరుజట్లలో గమనించదగ్గ ఆటగాళ్లు...

సన్ రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్ క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కట్.

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, జితేశ్ శర్మ, శామ్ కరన్, శశాంక్ సింగ్, సికిందర్ రజా, కగిసో రబాడా, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.

More Telugu News