CS Jawahar Reddy: ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి

  • ఏపీలో ఇటీవల పెన్షన్ల రగడ
  • కేంద్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన కూటమి నేతలు
  • ఈసీ ఆదేశాలను సీఎస్ పక్కదారి పట్టించారని ఫిర్యాదు
  • సీఎస్ వైఖరితో 33 మంది మరణించారని వెల్లడి 
Three parties alliance complains to NHRC against AP CS Jawahar Reddy

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు నేడు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ)కి ఫిర్యాదు చేశారు. పింఛన్ల వ్యవహారంలో సీఎస్ వ్యవహార శైలిపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని 'ఎన్ హెచ్ఆర్ సీ'ని కోరారు. 

వాలంటీర్లను పక్కనబెట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో పింఛన్ల పంపిణీకి ఈసీ ఆదేశాలు ఇచ్చిందని, కానీ ఆ ఆదేశాలను సీఎస్ పక్కదారి పట్టించారని కూటమి నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎస్ వైఖరితో 33 మంది మరణించారని 'ఎన్ హెచ్ఆర్ సీ'కి వివరించారు. కదల్లేక మంచాల్లో ఉన్నవారిని సైతం సచివాలయాలకు రావాలని వైసీపీ ప్రచారం చేసిందని, వైసీపీకి అనుకూలంగా సీఎస్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

ఇంటివద్దే పెన్షన్లు అందించేలా సీఎస్ ను ఆదేశించాలని... గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు అందేలా చూడాలని కూటమి నేతలు మానవ హక్కుల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. 

వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎస్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షన్ల నిధులు సమకూర్చడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

More Telugu News