Jagga Reddy: ఓడినా రాహుల్ గాంధీ రాజే... కాంగ్రెస్ పార్టీకి రాజపూజ్యం 16, అవమానం 2: జగ్గారెడ్డి

  • టీపీసీసీ చీఫ్ పదవిని తాను అడగడం కొత్తేమీ కాదని, అవకాశం వచ్చిన ప్రతిసారి అడుగుతానని స్పష్టీకరణ
  • రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నానన్న జగ్గారెడ్డి 
  • మంద కృష్ణ మాదిగ బీజేపీకి లాభం చేకూర్చేలా మాట్లాడుతున్నారని విమర్శ
Jaggareddy interesting comments on congress

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా... ఓడినా రాహుల్ గాంధీ రాజేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవమానం 2, రాజపూజ్యం 16గా ఉందన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... తాను టీపీసీసీ చీఫ్ పదవి అడగడం కొత్తేమీ కాదన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి తాను అడుగుతానని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పీసీసీ అవకాశం ఇస్తే ఓకేనని... రెడ్డిలకు ఇస్తే మాత్రం పోటీ పడే జాబితాలో తానూ ఉంటానన్నారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అన్నారు.

కాంగ్రెస్ అంటే మాదిగలు... మాదిగలు అంటే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. దామోదర రాజనర్సింహకు, మీరా కుమార్‌కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభిమానిగా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఈ పార్టీకి రాహుల్ గాంధీయే రాజు అన్నారు. ఎండాకాలంలో వర్షాలు పడవనే విషయం తెలియకుండా... బుద్ధి లేకుండా బీఆర్ఎస్ నాయకులు కరవు అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫ్రష్ట్రేషన్‌లో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. 100 రోజుల పాలన గురించి కాంగ్రెస్ వారిని అడగవద్దని... బస్సుల్లో ప్రయాణించే మహిళలను అడిగితే బాగుంటుందన్నారు.

బీజేపీ మాత్రం పదవుల కోసం ఏర్పడిన పార్టీ అని విమర్శించారు. రాజ్యాంగాన్ని అమలుపరచడం ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్థిక వనరుల సమీకరణ, బతుకుదెరువు కోసం పీకే సర్వే సంస్థను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మంద కృష్ణ మాదిగ బీజేపీకి లాభం చేకూర్చేలా మాట్లాడుతున్నారన్నారు. ఫిరాయింపులపై తాను స్పందించనన్నారు. తాను కూడా రెండుసార్లు పార్టీ మారానని... కానీ పదవుల కోసం కక్కుర్తి పడలేదన్నారు.

  • Loading...

More Telugu News