Chandrababu: వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం: చంద్రబాబు హామీ

  • వాలంటీర్లను తొలగించబోమన్న చంద్రబాబు 
  • వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని హామీ
  • జగన్ అవకాశవాద రాజకీయం చేస్తున్నారని మండిపాటు
Chandrababu promise to Volunteers

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించబోమని టీడీపీ అధినేత చంద్రబాబు చెపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు ఆయన ఈ విషయమై మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతామని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తే... తాము అండగా ఉంటామని చెప్పారు. టీడీపీ కార్యాలయంలో ఈరోజు పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  

నిన్న, మొన్న వాలంటీర్లను రాజీనామా చేయమంటూ ఒత్తిడి తెచ్చారని... ఇప్పుడు వాలంటరీ వ్యవస్థే లేదని అంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారా, రహస్య జీవో ఏదైనా ఇచ్చారా అని సీఎం జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. మళ్లీ సీఎం అయితే  తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే పెడతానని జగన్ అన్నారని... అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా అని అడిగారు. అవకాశవాద రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

వాలంటీర్లను రాజీనామా చేసి, వైసీపీ కోసం పని చేయమంటున్నారని... రాజీనామా చేయనివారిని రాజీనామా చేయకుండానే పార్టీ కోసం పని చేయాలని కూడా చెపుతున్నారని మండిపడ్డారు. తప్పుడు పనులు చేస్తే కేసులు నమోదవుతాయని... కేసులు నమోదైతే వాలంటీర్లకు భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా రావని చెప్పారు. జగన్ మోసాలను వాలంటీర్లు గుర్తించాలని సూచించారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్ మెంట్ చేసి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు.

More Telugu News