నేను సినిమాలు చేసినంత కాలం సమంతతో చేస్తూనే ఉంటా: సుకుమార్
- రంగస్థలంలో తొలుత సమంతను అనుకోలేదన్న సుకుమార్
- సమంత నటనను చూసి ఆశ్చర్యపోయానని వ్యాఖ్య
- అద్భుతమైన హావభావాలను ప్రదర్శించిందని ప్రశంస
సమంత పోషించిన లక్ష్మి పాత్రకు తొలుత సమంతను అనుకోలేదని సుకుమార్ తెలిపారు. 'రంగస్థలం'లో చరణ్ నటన అద్భుతమని చెప్పారు. చరణ్ ను దృష్టిలో పెట్టుకునే కథను రాసుకున్నానని తెలిపారు. హీరోయిన్ పాత్రను మాత్రం సమంత కోసం రాయలేదని చెప్పారు. హీరో, హీరోయిన్ ఇద్దరూ స్టార్స్ అయితే సెట్ లో తాను మేజేజ్ చేయలేనేమో అని అనుకున్నానని... అందుకే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నానని చెప్పారు.
అయితే సినిమా కథ ప్రకారం మంచి ఆర్టిస్ట్, తెలుగు వచ్చిన హీరోయిన్ కావాలని.. సమంత అయితే బెటర్ అని నిర్ణయించుకుని ఆమెను తీసుకున్నామని సుకుమార్ తెలిపారు. షూటింగ్ సమయంలో సమంత నటన చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. ప్రతి సన్నివేశంలో సమంత అద్భుతమైన హావభావాలను ప్రదర్శించిందని కొనియాడారు. తాను సినిమాలు తీసినంత కాలం సమంతతో చేస్తూనే ఉంటానని చెప్పారు.