Condoms In Samosa: సమోసాలలో కండోమ్ లు, గుట్కా, రాళ్లు.. పూణె కంపెనీపై పోలీస్ కేసు

Condoms gutka stones found in samosas supplied to Pune auto firm
  • మాజీ ఉద్యోగుల నిర్వాకమేనని తేల్చిన పోలీసులు
  • క్యాటరింగ్ కంపెనీ మేనేజర్ పై కోపంతోనే చేయించారట
  • తమ స్నేహితులను కంపెనీలో చేర్పించి కుట్ర
  • ఐదుగురిని అరెస్టు చేసిన పూణె పోలీసులు
పూణెలోని ఓ ఆటోమొబైల్ కంపెనీ క్యాంటిన్ లో సమోసాలు తిన్న ఉద్యోగులు వాంతులు చేసుకున్నారు. సమోసాలలో ఏకంగా కండోమ్ లు, గుట్కా, రాళ్లు రావడంతో షాక్ కు గురయ్యారు. సమోసాలు సప్లై చేసిన కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్యాటరింగ్ కంపెనీకి వెళ్లి విచారించిన పోలీసులు ఇదంతా ఆ కంపెనీ మాజీ ఉద్యోగుల నిర్వాకమని తేల్చారు. ఉద్యోగంలో నుంచి తొలగించారనే కోపంతో క్యాటరింగ్ కంపెనీకి చెడ్డపేరు తేవాలని ఉద్దేశపూర్వకంగా, పక్కాగా ప్లాన్ చేసి మరీ సమోసాలలో నానా చెత్తను పెట్టించారట. దీంతో మాజీ ఉద్యోగులు ముగ్గురితో పాటు ఈ నిర్వాకానికి పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. 

ఈ క్యాటరింగ్ కంపెనీ గతంలో మరో కంపెనీకి సప్లై చేసిన స్నాక్స్ లోనూ ఇలాగే ఓ బ్యాండ్ ఎయిడ్ కనిపించింది. సదరు కంపెనీ ఫిర్యాదు చేయడంతో తమ ఉద్యోగులను విచారించిన క్యాటరింగ్ సంస్థ.. ముగ్గురు ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని తేల్చింది. ఆ ముగ్గురినీ పనిలో నుంచి తొలగించింది. దీంతో కంపెనీపై కోపం పెంచుకున్న ఆ ఉద్యోగులు ముగ్గురూ పకడ్బందీగా ప్లాన్ చేసి తమ స్నేహితులు ఇద్దరిని కంపెనీలో చేర్చారు. ఆపై వారితో సమోసాలు తయారు చేసేటపుడు వాటిలో కండోమ్ లు, గుట్కా ప్యాకెట్లు, రాళ్లు పెట్టించారు. దీనికి కారణమైన ఇద్దరు ఉద్యోగులు ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ లను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ప్రతీకార స్టోరీ మొత్తం బయటపడింది. దీంతో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
Condoms In Samosa
Pune
Cattering Company
Maharashtra
Police Case

More Telugu News