Mumbai Indians: కెప్టెన్‌కు కావాల్సింది అదే.. డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో వైరల్

  • కెప్టెన్ జట్టు నుంచి సమష్టి ప్రదర్శన ఆశిస్తాడన్న హిట్‌మ్యాన్
  • బ్యాటింగ్ కోచ్ పొలార్డ్, హెడ్ కోచ్ మార్క్ బౌచర్‌లు ఇదే కోరుకుంటారని అభిప్రాయం
  • ఢిల్లీపై మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు
That is What Captain Wants Rohit Sharma Dressing Room Speech went Viral After Mumbai Indians first win in IPL 2024

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్ధిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించిన వ్యవహారంపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. మైదానంలో ఎలాంటి ఆసక్తికర పరిణామం జరిగినా కెప్టెన్సీకి ఆపాదిస్తూ అనేక వార్తలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్‌గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ తొలి విజయం సాధించిన అనంతరం డ్రెసింగ్ రూమ్ సెలబ్రేషన్స్‌లో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ముంబై కోచ్ మార్క్ బౌచర్ మాట్లాడుతూ... ‘‘బ్యాటింగ్ లైనప్‌లో సీనియర్ కావడంతో టీమ్ అవార్డు నీకే ఇస్తున్నాం రోహిత్’’ అని అన్నారు. ప్రత్యర్థి ఢిల్లీకి 235 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించావంటూ హిట్‌మ్యాన్‌ని మెచ్చుకున్నారు. ఇక కీరన్ పొలార్డ్ ఈ అవార్డు అందించడంతో రోహిత్ శర్మ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ... ఈ మ్యాచ్‌‌లో తాను చేసింది అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అని భావించడం లేదని అన్నాడు. బ్యాటింగ్‌లో ఆటగాళ్లు అందరూ రాణించడంతోనే భారీ స్కోరు సాధించగలిగామని వ్యాఖ్యానించాడు. సమష్టిగా వ్యక్తిగత ప్రదర్శనలు చేస్తేనే టీమ్ విజయాలు సాధించగలుగుతుందని అన్నాడు. జట్టు నుంచి కెప్టెన్‌కు కావాల్సింది ఇదేనని రోహిత్ పేర్కొన్నాడు. బ్యాటింగ్ కోచ్ పొలార్డ్, ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ ఇలాంటి ప్రదర్శననే ఆశిస్తున్నారని చెప్పాడు. హార్ధిక్ పాండ్యా పేరు ఎత్తకుండానే రోహిత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కాగా ముంబై విజయం సాధించిన ఢిల్లీపై మ్యాచ్‌లో రోహిత్ శర్మ 27 బంతుల్లో 49 పరుగులు బాదాడు. జట్టుకు చక్కటి ఆరంభాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ ఒకే ఒక్క విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది.

More Telugu News