YS Sharmila: భూతద్దం పెట్టి వెతికినా జగన్ పాలనలో వైఎస్సార్ పాలన ఆనవాళ్లు కనిపించవు: వైఎస్‌ షర్మిల

  • వైఎస్ పాలనతో జగన్ పాలనకు పోలికే లేదన్న షర్మిల
  • వివేకా హత్య కేసు నిందితుడు అవినాశ్ కు మళ్లీ టికెట్ ఇచ్చారని మండిపాటు
  • హంతకులకు ఓటు వేయొద్దని పిలుపు
YS Sharmila fires on Jagan

తన తండ్రి వైఎస్సార్ పాలనకు, జగన్ పాలనకు మధ్య ఎలాంటి పోలిక లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వైఎస్ పాలనతో జగన్ కు పోలికే లేదని... భూతద్దం పెట్టి వెతికినా కనీస ఆనవాళ్లు కూడా కనిపించవని చెప్పారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి నిందితుడని సీబీఐ చెప్పిందని... కాల్ రికార్డులు, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయని తెలిపిందని గుర్తు చేశారు. అవినాశ్ హస్తం ఉందని అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ... అవినాశ్ ను కాపాడుతున్నారని మండిపడ్డారు. బస్సు యాత్రలో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఈరోజు ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ కే మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారని జగన్ పై షర్మిల మండిపడ్డారు. అవినాశ్ మళ్లీ చట్టసభలోకి అడుగు పెట్టకూడదని అన్నారు. హంతకులకు ఓటు వేయొద్దని చెప్పారు. వైఎస్ బిడ్డనైన తనను గెలిపించాలని... ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న వాళ్లు ఓవైపు... హంతకులు మరోవైపు ఉన్నారని... ఎవరికి ఓటు వేసి గెలిపిస్తారో ఆలోచించాలని అన్నారు. 

రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మెగా డీఎస్సీ ఇస్తామని జగన్ చెప్పారని... నాలుగున్నరేళ్లు నిద్రపోయి లేచిన తర్వాత 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని షర్మిల ఎద్దేవా చేశారు. సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి... ప్రభుత్వమే ఇష్టం వచ్చినట్టు మద్యం విక్రయిస్తోందని విమర్శించారు. కల్తీ మద్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 

More Telugu News