Nara Lokesh: పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?: నారా లోకేశ్

  • చంద్రబాబు కేసులకు సంబంధించి డాక్యుమెంట్లను తగలబెట్టేశారన్న ఐటీడీపీ
  • వీడియో పంచుకున్న టీడీపీ సోషల్ మీడియా విభాగం
  • జగన్ ఆదేశాలతో తమ కుటుంబంపై భారీ కుట్ర జరిగిందన్న నారా లోకేశ్
  • మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక
Nara Lokesh shared sensational videos

టీడీపీ అధినేత చంద్రబాబుపై గతంలో అక్రమ కేసులు నమోదు చేశారని, ఆ కేసులకు సంబంధించిన పత్రాలను తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో తగలబెట్టారని టీడీపీ సోషల్ మీడియా ఐటీడీపీ విభాగం నేడు ఆరోపించింది. చేసిన తప్పుడు పనులు, ఫేక్ ఆధారాలు, కీలక పత్రాలు తగలబెట్టమని సీఐడీ అధికారి రఘురామిరెడ్డి ఆదేశించారని ఐటీడీపీ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. 

తాడేపల్లి ప్యాలెస్ కు ఓటమి భయం పట్టుకుందని, రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును వేధించి నేడు ఆ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు తగలబెట్టారని ఐటీడీపీ వివరించింది. అవి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాలు అని వెల్లడించింది. అన్ని సర్వేలు కూటమిదే విజయం అని చెప్పడంతో సీఐడీ అధికారి రఘురామిరెడ్డి అప్రమత్తం అయ్యారని పేర్కొంది.

ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. "నేరపరిశోధనపై దృష్టిసారించాల్సిన ఏపీసీఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని మేం ఎప్పటినుంచో  చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయి. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్ లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జేపీఎస్ (జగన్ పోలీస్ సర్వీస్)గా రూపాంతరం చెందారు. 

మా కుటుంబంపై బురదజల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వాన అనుమతులు లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసిపోవడంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ పత్రాలను తగులబెడుతున్నారు. 

ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభాలుగా నిలవాల్సిన కొందరు ఐపీఎస్ లు ఇంతటి బరితెగింపునకు పాల్పడటం దేశచరిత్రలో ఇదే ప్రథమం. పత్రాలు తగలబెడితే పాపాలు పోతాయా? చట్టాన్ని ఉల్లంఘించి చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు" అంటూ నారా లోకేశ్ హెచ్చరించారు.

More Telugu News