Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజుకు ఇక నరసాపురం ఛాన్స్ లేనట్టే.. క్లారిటీ ఇచ్చేసిన బీజేపీ!

  • పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ
  • శ్రీనివాసవర్మను లోక్ సభ బరిలోకి దించిన బీజేపీ
  • అభ్యర్థుల విషయంలో మార్పు ఉండదన్న సిద్ధార్థ్ నాథ్
Narasapuram doors closed for Raghu Rama Krishna Raju

ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన నేత నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. ఈ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేయాలని ఆశించన ఆయనకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. తమ పార్టీ తరపున శ్రీనివాసవర్మను లోక్ సభ ఎన్నికల బరిలోకి దించింది. అయినప్పటికీ రఘురాజు తనకు టికెట్ వచ్చే అవకాశం ఉందనే భావిస్తూ వచ్చారు. తాజాగా ఈ అంశంపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. తాము ప్రకటించిన అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ మాట్లాడుతూ... లోక్ సభ అభ్యర్థిగా శ్రీనివాసవర్మ బరిలో ఉంటారని తెలిపారు. దీంతో, రఘురాజుకు నరసాపురం అవకాశాలు మూసుకుపోయాయి. 

తాజా పరిణామంతో రఘురాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గంపై ఫోకస్ చేస్తున్నారు. అయితే, ఇప్పటికే ఉండి శాసనసభ అభ్యర్థిగా రామరాజును టీడీపీ ప్రకటించింది. రామరాజు కూడా పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా లేరు. ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని ఆయన చెపుతున్నారు. ఈ నేపథ్యంలో, రఘురాజు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరి ఈయన విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. రఘురాజు ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

More Telugu News