Balakrishna: త్వరలో జరిగే ఎన్నికలు మహా సంగ్రామం లాంటివి: నందమూరి బాలకృష్ణ

  • ఆదివారం హిందూపురంలో కూటమి పార్టీల ఉమ్మడి కార్యాచరణ సమావేశం
  • సమావేశంలో నందమూరి బాలకృష్ణ ప్రసంగం
  • కూటమి పార్టీ కార్యకర్తలు కష్టపడి అభ్యర్థులను గెలిపించుకోవాలన్న బాలయ్య
  • రాష్ట్రానికి సమర్థపాలన చంద్రబాబుతోనే సాధ్యమని వ్యాఖ్య
Nandamuri Balakrisha urges party cadre to work towards victory

త్వరలో జరిగే ఎన్నికలు మహాసంగ్రామం లాంటివని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు కష్టపడి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఆదివారం హిందూపురం నియోజకవర్గంలోని జేవీఎస్ ప్యాలెస్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణ, విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేశారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో రక్తం పారించారని, మద్య నిషేధం అమలు చేయకుండా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పదేళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. ఇలాంటి రాష్ట్రానికి సమర్థమైన పాలన అందించి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే చంద్రబాబునాయుడి ద్వారానే సాధ్యమని అన్నారు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తాను హ్యాట్రిక్ సాధిస్తానని అన్నారు. నా అక్కాచెల్లెళ్లు అంటూ సొంత చెల్లెళ్లకే అన్యాయం చేశాడని జగన్ పై విమర్శలు చేశారు. 

ఈ సమావేశంలో హిందూపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి, జనసేన పార్టీ నాయకులు వరుణ్, ఆకుల ఉమేశ్, బీజేపీ నాయకులు ఆదర్శకుమార్, వరప్రసాద్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

More Telugu News