Asaduddin Owaisi: ముక్తార్ అన్సారీ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తే నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు: ఒవైసీ

  • ఇటీవల యూపీలో జైలుశిక్ష అనుభవిస్తూ మృతి చెందిన గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ
  • ఒవైసీ, మాధవీలత మధ్య మాటల యుద్ధం
  • అన్సారీ ఆరు హత్యలు చేసిన వ్యక్తి అంటూ మాధవీలత వ్యాఖ్యలు
  • అలాంటి వ్యక్తి ఇంటికి ఒవైసీ ఎలా వెళతారని ఆగ్రహం
Owaisi said he is facing death threats in social media

లోక్ సభ ఎన్నికల వేళ హైదరాబాద్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో మాజీ ఎంపీ, గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ జైలు శిక్ష అనుభవిస్తూ మరణించాడు. 

అయితే, యూపీలో ముక్తార్ అన్సారీ కుటుంబ సభ్యులను పరామర్శిస్తే నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు అంటూ హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తానేమీ ఆషామాషీగా చచ్చేవాడ్ని కాదని స్పష్టం చేశారు. తనకేదైనా జరిగితే ఆ తర్వాత జరిగే దానికి మీరే బాధ్యులు అంటూ హెచ్చరించారు. 

తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి హైదరాబాద్ ఎంపీ స్థానంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏరికోరి డాక్టర్ మాధవీలతను హైదరాబాద్ లోక్ సభ స్థానంలో తమ అభ్యర్థిగా బరిలో దింపింది. మాధవీలత తనదైన శైలిలో నియోజకవర్గంలో ముందుకు పోతున్నారు. ఎక్కడ ఇఫ్తార్ విందు జరిగినా హాజరవుతూ హైదరాబాద్ పాతబస్తీలో తన ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

కాగా, ఒవైసీ వ్యాఖ్యలకు మాధవీలత కౌంటర్ ఇచ్చారు. ఆరు హత్యలు చేసిన ముక్తార్ అన్సారీ ఇంటికి ఒవైసీ ఎలా వెళతారు? ఎలా పరామర్శిస్తారు? అంటూ మాధవీలత నిలదీశారు. హైదరాబాద్ లో చనిపోయిన వారి కుటుంబాలను ఒవైసీ ఎందుకు పరామర్శించరని ప్రశ్నించారు. ఒవైసీ సోషల్ మీడియా బెదిరింపులకు కూడా భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News