Chandrababu: ముందు గొడ్డలి వస్తుంది... ఆ తర్వాత జగన్ వస్తాడు: పెనమలూరులో చంద్రబాబు సెటైర్లు

  • కృష్ణా జిల్లా పెనమలూరులో చంద్రబాబు ప్రజాగళం సభ
  • జగన్ ఫ్యాన్ ఆగిపోయిందంటూ వ్యంగ్యం
  • గొడ్డలిని సింబల్ గా పెట్టుకోవాలని ఎద్దేవా
  • వచ్చే ఎన్నికలతో శని వదిలిపోతుందని వ్యాఖ్యలు
Chandrababu satires on CM Jagan

టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా పెనమలూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, సీఎం జగన్ పై వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ నిన్న జాతీయ రహదారిపై ప్రయాణించినా సరే చెట్లు నరికేశారని ఆరోపించారు. జగన్ వస్తున్నాడంటే... ముందు గొడ్డలి వస్తుంది, ఆ తర్వాత జగన్ వస్తాడు అని ఎద్దేవా చేశారు. జగన్ ఫ్యాన్ తిరగడం మానేసింది... దాన్ని ప్రజలు తుక్కు తుక్కు చేసి చెత్తకుండీలో వేసేస్తారు... కావాలంటే గొడ్డలిని నీ సింబల్ గా పెట్టుకో... ప్రజలు నీ పార్టీని ఓడించి బంగాళాఖాతంలో కలిపేస్తారు... శని వదిలిపోతుంది అని వ్యాఖ్యానించారు.

"ఇంకా కొందరు అధికారుల్లో మార్పు రావడంలేదు. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, ఏ పని చేయాలన్నా ఎన్నికల సంఘం ఉంది. ప్రజాస్వామ్యం కాబట్టి జగన్ పదవిలో ఉంటాడంతే. ఏ పని చేయాలన్నా ఎన్నికల సంఘం చేయాల్సిందే. 

ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ సమానం. ఆ విషయాన్ని మర్చిపోయి మా మీటింగులకు భద్రత కల్పించకుండా, ముఖ్యమంత్రి మీటింగులకు మాత్రం ప్రొటెక్షన్ ఇస్తున్నారు. నేను కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. అతడు (జగన్) రేపో, ఎల్లుండో మాజీ సీఎం అవుతున్నాడు. అది ఎక్స్ పైర్ అయిన మందు... వాడినా పవర్ ఉండదు. 

ముఖ్యమంత్రి అంటున్నాడు... ఆయన ఒంటరిగా వస్తున్నాడంట. కాదు... నువ్వు శవాలతో వస్తున్నావు. 2014 ఎన్నికల్లో తండ్రి లేని బిడ్డ అంటూ వచ్చాడు... 2019లో తండ్రి లేడు, బాబాయ్ కూడా పోయాడు అని చెప్పాడు... ఇప్పుడు పెన్షన్ దారులైన వృద్ధుల మృతదేహాలతో వచ్చాడు. 

ఇక్కడే ఒక మహా నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చాడు... శవరాజకీయాలు ప్రారంభించాడు. నీ సంగతేంటో, నీ శవరాజకీయాలు ఏంటో చూస్తా. పరిగెత్తించే రోజు దగ్గర్లోనే ఉంది. పెనమలూరు నియోజకవర్గం ప్రజలు అతడ్ని తిరుగుటపాలో పంపించాలి. 

ఆ పార్టీలో మంచివాళ్లకు చోటు లేదు. బాలశౌరి, పార్థసారథి వంటి నేతలు ఆ పార్టీలో ఉండలేక బయటికి వచ్చేశారు. నన్ను, పవన్ కల్యాణ్ ను తిడితే టికెట్ ఇస్తారంట. ఆ పార్టీలో ఉండేది గుడివాడ బూతుల నాని, ఇంకొకడు గన్నవరంలో ఉంటాడు, ఇంకొకాయన ఇక్కడికి వచ్చాడు మహా మేధావి. ఇంకొక నాని మచిలీపట్నంలో ఉన్నాడు... వీళ్లు నాయకులు... మీరు వాళ్లకు ఓట్లేయాలంట! 

ఇంకా ప్రజల్లో ఐకమత్యం రాలేదు... ఇప్పటికే ఊళ్లకు ఊళ్లు కదిలి ఉండాలి... వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. జగన్ వస్తే బాయ్ కాట్ చేయాలి... నువ్వు వద్దు, నీ పాలన వద్దు... మా బతుకు మేం బతుకుతాం అని ఇంటికి పంపితే అతడు భయపడతాడు. 

ఆ పార్టీలో పది మంది ఎమ్మెల్యేలు చెల్లాచెదురయ్యారు... ఎంపీలు పారిపోయారు... ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉన్న ఎమ్మెల్సీలు కూడా బయటికి వచ్చేస్తున్నారు. ఇవాళ పొత్తు కుదుర్చుకుంది నా కోసమో, పవన్ కల్యాణ్ కోసమో కాదు. ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నాం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో రూ.13 లక్షల కోట్ల అప్పులున్నాయి. రేపు మా ప్రభుత్వం వచ్చినా ఒక్క పైసా లేకపోతే ఏమీ చేయలేం... అందుకే అవన్నీ ఆలోచించి దూరదృష్టితో ఎన్డీయే కూటమిలో చేరాం" అని వివరించారు.

బాలిక అందించిన ఫ్యాన్సీ కళ్లజోడుతో సరికొత్తగా కనిపించిన చంద్రబాబు

పెనమలూరు సభ ముగిసిన తర్వాత డీజేలో సైకో పోవాలి, సైకిల్ రావాలి పాట వస్తుండగా చంద్రబాబు ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్భంగా ఓ బాలిక అందించిన ఫ్యాన్సీ కళ్లజోడు పెట్టుకుని సరికొత్తగా కనిపించారు. అనంతరం ఆ కళ్లజోడును బాలికకు తిరిగిచ్చేసి ఆశీర్వదించారు.

More Telugu News