Anand Mahindra: అలెక్సా సాయంతో కోతులను తరిమిన అమ్మాయికి ఆనంద్ మహీంద్రా ఓపెన్ ఆఫర్

  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • చిన్న పాపను ఆడిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన కోతులు
  • అలెక్సాను కుక్కలా మొరగాలని ఆదేశించిన నికిత అనే 13 ఏళ్ల బాలిక
  • నిజంగానే కుక్క అరుస్తోందని పారిపోయిన కోతులు
Anand Mahindra open offer to the girl who threatened monkeys with Alexa

ఉత్తరప్రదేశ్ కు చెందిన నికిత అనే బాలిక అలెక్సా సాయంతో కోతులను తరిమి ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడా అమ్మాయికి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే... నికిత వయసు 13 ఏళ్లు. ఆమె తన మేనకోడలు వామిక (15 నెలలు)ను ఆడిస్తుండగా... ఒక్కసారిగా కోతుల గుంపు వాళ్లింట్లోకి చొరబడింది. ఆ కోతులు ఇంట్లో ఉన్న వస్తువులను చెల్లాచెదురు చేస్తూ, విధ్వంసం సృష్టించాయి. 

ఆ సమయంలో పెద్దవాళ్లెవరూ ఇంట్లో లేరు. ఆ వానరాలు తమ వద్దకు వస్తుండడాన్ని గమనించిన నికిత ఏమాత్రం బయపడకుండా ఎంతో తెలివిగా ఆలోచించింది. ఇంట్లో అలెక్సా (వాయిస్ అసిస్టెంట్) ఉన్న విషయాన్ని గమనించి, కుక్కలాగా మొరగాలి అంటూ అలెక్సా కు కమాండ్ ఇచ్చింది. వెంటనే అలెక్సా స్పీకర్ నుంచి కుక్క అరిచినట్టుగా పెద్ద శబ్దాలు రావడంతో, నిజంగానే కుక్క అరుస్తోందని భావించి కోతులు భయపడి పారిపోయాయి. ఇదీ... నికిత సమయస్ఫూర్తికి చెందిన వీరగాథ. 

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా దృష్టికి ఈ వ్యవహారం చేరింది. పాజిటివిటీకి మారుపేరుగా నిలిచే ఆనంద్ మహీంద్రా... నికిత వంటి వారిని ప్రోత్సహించడంలో ముందుంటారు. ఈ క్రమంలో... నికితకు భవిష్యత్తులో తాము ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. 

ఆ అమ్మాయి చదువు పూర్తయిన తర్వాత ఏదైనా కార్పొరేట్  సంస్థలో చేరాలనుకుంటే, తమ మహీంద్రా రైజ్ సంస్థ ఆమె కోసం ద్వారాలు తెరిచి ఉంచుతుందని ఆనంద్ మహీంద్రా వివరించారు. ఎప్పుడైనా ఉద్యోగం కావాలనుకుంటే మహీంద్రా రైజ్ లో చేరాలని ఆహ్వానిస్తున్నాం అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, ఇప్పటితరం పిల్లల మేధాశక్తి మన ఊహకు అందని విషయం, వారి తెలివితేటలు అమోఘం, ఆ సమయంలో నికితకు వచ్చిన ఆలోచన అద్భుతం అని కొనియాడారు.

More Telugu News