Ambati Rambabu: మేం పొమ్మన్న నేతలే టీడీపీకి దిక్కవుతున్నారు: అంబటి రాంబాబు

  • టీడీపీకి అభ్యర్థులు దొరకడంలేదని ఎద్దేవా
  • పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తులేదని సెటైర్
  • చంద్రబాబు సభలు అన్నీ అట్టర్ ప్లాప్ అన్న వైసీపీ నేత
AP Minister Ambati Rambabu Setaires on Chandrababu and Pawan Kalyan

మేం పొమ్మన్న నేతలను చంద్రబాబు రమ్మంటున్నారని, వాళ్లకు టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెడుతున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. లావు కృష్ణదేవరాయులు, జంగా కృష్ణమూర్తి మా పార్టీ నుంచి వెళ్లి సైకిల్‌ ఎక్కారని గుర్తుచేశారు. టీడీపీకి అభ్యర్థులే దొరకట్లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ లపై తాను విమర్శలు చేశానే తప్ప ఏనాడు వారిని తిట్టలేదని చెప్పారు. అయితే, చంద్రబాబు మాత్రం దిగజారి మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు. ఈమేరకు ఆదివారం మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు. 

ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో టీడీపీకి అన్నిచోట్లా తిరస్కారమే ఎదురవుతోందని చెప్పారు. చిన్న చిన్న సందుల్లో టీడీపీ మీటింగ్ లు పెట్టినా సరే జనం రావడమేలేదని అన్నారు. చంద్రబాబు ప్రచార సభలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ను విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తులేవని అంబటి ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ వంటి టీడీపీ నేతలే చంద్రబాబును తిడుతున్నారని గుర్తుచేశారు.

175 స్థానాల్లో వైసీపీ జెండా ఎగురుతుంది..
రాష్ట్రంలోని 175 స్థానాల్లో వైసీపీ జెండా ఎగురుతుందని, జగన్ మళ్లీ సీఎం అవుతారని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. సర్వేలు కూడా ఇదే విషయం వెల్లడించాయని గుర్తుచేశారు. ఓటమి ఖాయమని తేలిపోవడంతో చంద్రబాబు ఫ్రస్టేషన్ కు గురవుతున్నారని చెప్పారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతారని అన్నారు. రెండు రోజులు ప్రచారం చేసి ఐదు రోజులు పడకేసే పవన్ కు రాజకీయాలు ఎందుకని అంబటి ప్రశ్నించారు.

తనపై చేస్తున్న ఆరోపణలపై..
ఈ సందర్భంగా తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై అంబటి స్పందించారు. డబ్బుల కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. సంక్రాంతి పండుగకు సంతోషంతో డ్యాన్స్ చేయడాన్ని కూడా ప్రతిపక్ష నేతలు తప్పుబడుతున్నారని విమర్శించారు. రోజుకు ఒక పార్టీతో డ్యాన్స్ చేసే చంద్రబాబు లాగా తాను పొలిటికల్ డ్యాన్సర్ ను కాదని అంబటి సెటైర్ వేశారు.

More Telugu News