Road Accident: కరీంనగర్ జిల్లాలో విషాదం.. టిప్పర్ వస్తుందని ఆగినందుకు ముగ్గురు సజీవ సమాధి

  • బోనాల పండుగలో మొక్కులు తీర్చుకుని వస్తుండగా ఘటన
  • టిప్పర్‌లోని మట్టి మీదపడి అక్కడికక్కడే మృతి
  • భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన మరో ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు మృత్యువాత
6 dead in Telangana in separate accidents

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని బోరనపల్లిలో విషాదం జరిగింది. గ్రామ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన బోనాల పండుగలో మొక్కులు చెల్లించుకునేందుకు  గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు గంట విజయ్ (17), గంట వర్ష (15), వారి బంధువు గంట సింధూజ (18) వెళ్లారు. మొక్కులు చెల్లించుకున్న తర్వాత అర్ధరాత్రి దాటాక నిద్ర వస్తుందని తల్లిదండ్రులతో చెప్పి ఇంటికి పయనమయ్యారు. మార్గమధ్యంలో ఎలబోతారం నుంచి ఎదురుగా మట్టి టిప్పర్ వస్తుండడంతో మూలమలుపు వద్ద బైక్ ఆపి నిల్చున్నారు. వేగంగా వస్తున్న టిప్పర్ డ్రైవర్ వారిని చూసి సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి టిప్పర్ బోల్తాపడింది. అందులోని మట్టి వారిమీద పడడంతో పిల్లలు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో మృతదేహాలను వెలికితీసి హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ ఇంటర్ చదువుతుండగా, వర్ష పది, సింధూజా డిగ్రీ చదువుతున్నారు.

మరో ఘటనలో తల్లీపిల్లలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన మరో ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడుకు చెందిన చీమల బాలకృష్ణ కుటుంబం వారం రోజుల క్రితం అశ్వారావుపేట సమీపంలోని కోళ్లపారంలో పనికి కుదిరింది. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నిన్న విస్సన్నపేట మండలం చండ్రుపట్లలో బంధువుల పెళ్లికి బాలకృష్ణ హాజరయ్యాడు. పెళ్లి అనంతరం తిరిగి అశ్వారావుపేట వస్తుండగా మందలపల్లి సమీపంలో గుర్తు తెలియని కారు వెనకవైపు నుంచి ఢీకొట్టింది. దీంతోవారు ఎగిరిపడ్డారు. అదే సమయంలో సత్తుపల్లి వైపు నుంచి అశ్వారావుపేట వైపు వెళ్తున్న లారీ వారిపైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లక్ష్మి (28), శరణ్య శ్రీ (8), షణ్మిక (6) అక్కడికక్కడే మృతి చెందారు. బాలకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News