Virat Kohli: కింగ్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఐపీఎల్ రికార్డు

  • రాజస్థాన్ రాయల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన విరాట్
  • గత రాత్రి సెంచరీతో 731కి చేరిన మొత్తం పరుగులు
  • శిఖర్ ధావన్‌ను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచిన స్టార్ బ్యాట్స్‌మెన్
Virat Kohli breaks Shikhar Dhawans major IPL record against Rajasthan Royals

ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం రాత్రి జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌పై కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి చెలరేగి ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ ఒక ఐపీఎల్ రికార్డును నెలకొల్పాడు. శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. 39 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న విరాట్.. వ్యక్తిగత స్కోరు 62 పరుగుల వద్ద ఈ ఫీట్‌ను అందుకున్నాడు. శిఖర్ ధావన్‌ను వెనక్కి నెట్టి రాజస్థాన్ రాయల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు రాజస్థాన్‌పై 700 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగానూ కోహ్లీ నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్‌పై కోహ్లీ ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు ఆడాడు. అతడి స్ట్రైక్ రేట్‌ 156.94 శాతంగా ఉంది. ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీల సాయంతో 731 పరుగులు చేశాడు.

రాజస్థాన్ రాయల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీళ్లే..
1. విరాట్ కోహ్లీ - 29 మ్యాచుల్లో 731 పరుగులు
2. శిఖర్ ధావన్ - 24 మ్యాచుల్లో 679 పరుగులు
3. ఏబీ డివిలియర్స్ - 20 మ్యాచుల్లో 652 పరుగులు
4. కేఎల్ రాహుల్ - 15 మ్యాచుల్లో 637 పరుగులు
5. సురేష్ రైనా - 23 మ్యాచుల్లో 630 పరుగులు

ఇక విరాట్ కోహ్లీ శనివారం రాత్రి ఐపీఎల్ 2024లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 316 పరుగులు చేసిన కోహ్లీ ఆరెంజ్ క్యాప్‌ ప్లేయర్‌గా (అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు) కొనసాగుతున్నాడు. మరోవైపు గత రాత్రి రాజస్థాన్‌పై మ్యాచ్‌లో బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మొదటి వికెట్‌కు ఏకంగా 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సాధించారు. ఎక్కువసార్లు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన బెంగళూరు జోడీగా వీరిద్దరూ నిలిచారు.

ఐపీఎల్‌లో 100 పరుగుల కంటే ఎక్కువ భాగస్వామ్యాలు..
1. డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్  - 6 
2. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో - 5 
3. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ - 5
4. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ - 4
4 - రుతురాజ్ గైక్వాడ్ & డెవాన్ కాన్వే
5. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ - 4

More Telugu News