Madhavi Latha: లక్షన్నర ఓట్ల మార్జిన్‌తో ఒవైసీ ఓడిపోతారు: బీజేపీ నేత మాధవీ లత

  • ఇండియాటీవీలో ప్రసారమయ్యే ఆప్‌‌ కీ అదాలత్‌ షోలో పాల్గొన్న మాధవీ లత
  • బోగస్ ఓట్లతో అసదుద్దీన్ ఒవైసీ భారీ మార్జిన్లతో గెలుస్తున్నారని ఆరోపణ
  • ఎన్నికల అఫిడవిట్‌లో ఒవైసీ రూ. 10 లక్షల ఆదాయం చూపించారన్న మాధవీ లత
  • కూతురి నిశ్చార్థంపై ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపణ
Owaisi will lose by One and half lakh votes in Lok Sabha polls says BJP candidate Madhavi Latha

హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన కొంపెల్ల మాధవీ లత ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓటమి ఖాయమని అన్నారు. లక్షన్నర ఓట్ల మార్జిన్‌తో ఒవైసీ ఓటమి చవిచూస్తారని చెప్పారు. ఇటీవల ఆమె ఇండియాటీవీలో ప్రసారమయ్యే ఆప్ కీ అదాలత్ షోలో పాల్గొన్నారు. ఒవైసీ బోగస్ ఓటు బ్యాంక్ ఈసారి పనిచేయదని ధీమా వ్యక్తం చేశారు.

గత 40 ఏళ్లుగా ఒవైసీకి హైదరాబాద్ కంచుకోటగా ఉందన్న విషయాన్ని షో వ్యాఖ్యాత రజత్ శర్మ ప్రస్తావించారు. అంతేకాకుండా, 2019 ఎన్నికల్లో 3 లక్షల మెజారిటీతో ఆయన గెలిచిన విషయం గుర్తు చేశారు. దీనికి మాధవీ లత బదులిస్తూ బోగస్ ఓట్లు ఉంటే తాము గెలిచేవాళ్లమని అన్నారు. ‘‘నిజమే, అయితే, బోగస్ ఓట్లు ఉండి ఉంటే మేమూ గెలిచేవాళ్లం. కానీ మాకా ఓట్లు లేవు. ఒవైసీకి 6.20 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయి. వాటి ఐడీ నెంబర్లను ఈసీ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తే అది రెండు చోట్ల ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక్క చార్మినార్‌లోనే ఇలాంటి ఓట్లు 1.60 లక్షల వరకూ ఉన్నాయి’’ అని అన్నారు. ఒవైసీ అన్యాయంగా గెలుపు సొంతం చేసుకున్నారని, ఈ మాట అనేందుకు తాను భయపడనని చెప్పారు. ఈసారి కూడా ఒవైసీ మూడున్నర లక్షల మెజారిటీతో గెలుస్తారా? అన్న ప్రశ్నకు లక్షన్నర ఓట్ల మార్జిన్‌తో ఓటమి చవిచూస్తారని మాధవీ లత బదులిచ్చారు. 

ఒవైసీ అక్రమమార్గాల్లో కోట్లు కూడబెట్టారని మాధవీ లత ఆరోపించారు. తన సంపాదన ఏటా రూ.10 లక్షలని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఒవైసీ కూతురి నిశ్చితార్థ వేడుక కోసం రూ. 6 కోట్లు ఖర్చు చేశారన్నారు. పాత బస్తీలో కొన్ని కుటుంబాలు తిండి కోసం ఇళ్లల్లోని బాలికలను అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. 40 ఏళ్లు హైదరాబాద్‌కు ఎంపీగా ఉన్న ఒవైసీ బీఫ్ గురించి మాట్లాడితే తాను త్రిపుల్ తలాఖ్ అమలు గురించి మాట్లాడుతున్నానని తెలిపారు. ఎమ్ఐఎమ్ బీజేపీకి బీ టీం అన్న ఆరోపణను కూడా ఖండించారు. అదే నిజమైతే పార్టీ తనను ఒవైసీపై పోటీకి ఎందుకు రంగంలోకి దించుతుందని ప్రశ్నించారు. వాస్తవానికి కాంగ్రెస్- బీఆర్ఎస్‌లే భాయి భాయి అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News