Chandrababu: రాముడు దేవుడు అయినా వానరసైన్యం సాయం తీసుకున్నాడు: క్రోసూరులో చంద్రబాబు ప్రసంగం

  • పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రజాగళం సభ
  • రాబోయేది ఎన్డీయే ప్రభుత్వం అని చంద్రబాబు ఉద్ఘాటన
  • ఏ ఒక్క మైనారిటీకి కష్టం కలగకుండా చూసుకుంటామని భరోసా
  • నాడు రాముడికి ఉడుత కూడా సాయం చేసిందని వెల్లడి
  • ఒంటరిని అంటూనే జగన్ శవాలతో వస్తున్నాడని విమర్శలు
Chandrababu says he comes with forces like Pawan Kalyan and NDA

టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కల్యాణ్ ఎప్పుడూ చెబుతుంటారని, ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవ్వాలంటే అందరం కలిసి పనిచెయ్యాలని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్ అని కొనియాడారు. 

ఇవాళ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉందని, మళ్లీ రాబోయేది కూడా ఎన్డీయే ప్రభుత్వమేనని అన్నారు. ప్రజల భవిష్యత్తు కోసమే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టాయని చంద్రబాబు స్పష్టం చేశారు. మైనారిటీ సోదరులకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా... వైసీపీ హయాంలో మీకు అన్యాయం జరిగింది కానీ... నేను ఎన్డీయేలో ఉన్నప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ ఏ ముస్లిం సోదరుడికి కానీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నా అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. 

టీనేజీ పిల్లలకు చంద్రబాబు సూచన


క్రోసూరు సభకు వస్తుంటే  పిల్లల ఉత్సాహం చూసి ముచ్చటేసింది. ఈ సభలోనూ టీనేజి పిల్లలు ఉన్నారు. టీనేజి పిల్లలు ప్రతి రోజూ తమ గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలి. మీ ఓటు ఎన్డీయే కూటమికి వేయాలంటూ మీ గ్రామస్తులకు చెప్పాలి. ఈసారి ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు అసెంబీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. 

కొమ్మాలపాటి శ్రీధర్ కు ఎమ్మెల్సీ ఇస్తున్నా

నేను చాలామంది రాజకీయ నేతలను చూశాను కానీ కొమ్మాలపాటి శ్రీధర్ వంటి నాయకుడు దొరకడం చాలా అరుదు. 40 శాతం యువతకు టికెట్లు ఇస్తామన్న హామీలో భాగంగానే పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్ కు అవకాశం ఇచ్చాం. ప్రవీణ్ యువకుడు, ఉత్సాహవంతుడు. ఈ నియోజకవర్గంలో కొమ్మాలపాటి శ్రీధర్ నాయకత్వంలో ప్రవీణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి. 

ఈ సందర్భంగా శ్రీధర్ కు భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటిస్తున్నా. ఇలాంటి విషయాలు నేనెక్కడా చెప్పను... ఇక్కడ చెప్పానంటే అదీ మా శ్రీధర్ ప్రత్యేకత. ఒక మాట మీదుండే వ్యక్తి శ్రీధర్. ప్రవీణ్ కు టికెట్ ఇవ్వగానే, శ్రీధర్ నా వద్దకు వచ్చి... సార్, ప్రవీణ్ ను గెలిపించుకుని వస్తాను అని చెప్పాడు. అలాంటి నాయకుడు ఉండడం పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల అదృష్టం.

ఈ పోరాటంలో నేను ఒంటరిని కాదు

నాడు రావణాసురుడ్ని చంపడానికి వానర సైన్యం అంతా ముందుకొచ్చిందా లేదా? రాముడు దేవుడు అయినప్పటికీ అందరి సహకారంతో ముందుకు వెళ్లాడు. చివరికి ఉడుత కూడా వారధి కట్టడానికి ఇసుక తీసుకువచ్చి సాయం చేసింది. అదీ... ఆ రోజుల్లో రావణుడికి వ్యతిరేకంగా రాముడు చేసిన పోరాటంలో ఆయనకు అందిన సహకారం. 

ఇవాళ ఈ పోరాటంలో నేను ఒంటరిగా రాలేదు. కేంద్రంలో ఉండే ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే జనసైనికులు, టీడీపీ వీరాభిమానులతో కలిసి వస్తున్నాను. జగన్ అంటున్నాడు... మీరందరూ కలిసి వస్తున్నారు, నేను ఒంటరివాడ్ని అంటున్నాడు. జగన్ ఒంటరివాడు కాదు, శవాలతో వస్తున్నాడు... కానీ నేను నాయకులతో మీ ముందుకు వస్తున్నా. జగన్ శవరాజకీయాలు చేసేందుకు వస్తున్నాడు... నేను మీ సమస్యలు పరిష్కారం చేసి, మీకు ఒక ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేందుకు వస్తున్నాను. 

ఒరిజినల్ అమరావతి ఇక్కడే ఉంది

ఈ ఐదేళ్ల పాలన ఒక పీడకల. ఈ ముఖ్యమంత్రి ఆదాయం కోసం, స్వార్థం నిండు ప్రాణాలైనా బలిస్తాడు. పెదకూరపాడు నియోజకవర్గం అంటే ఒరిజినల్ అమరావతి ఉన్న ప్రాంతం. ఆ తర్వాతనే నేను అమరావతి రాజధానికి రూపకల్పన చేశాను... అందుకు స్ఫూర్తి ఈ అమరావతే. 

పెదకూరపాడు నియోజకవర్గం పేరు చెబితే ఇసుక బకాసురుడు శంకరరావు గుర్తొస్తాడు. వీళ్లు రిటైల్ గా దోపిడీ చేస్తారని అనుకున్నా కానీ, వీళ్లు హోల్ సేల్ గా దోపిడీ చేసే బందిపోట్లు అని ఊహించలేకపోయాను. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి ఈ శంకరరావు, జగన్ పొట్ట నింపుకుంటారా? కృష్ణా నదిపైనే రోడ్డు వేశారంటే ఇది కలా, నిజమా అని ఊహించలేకపోతున్నా! 

ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా... అధికారంలోకి వచ్చాక ఈ ఇసుకాసురులను బొక్కలో వేసి మీకు ఉచితంగా ఇస్తా. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి అణగదొక్కుతాను. ఇసుక అరాచకం చూస్తే కడుపు రగిలిపోతోంది కానీ, ప్రజాస్వామ్యం కాబట్టి ఆగుతున్నా. తాపీ మేస్త్రులు ఫ్యాన్ కు సమాధి కట్టాలి... ఆ ఫ్యాన్ సమాధి నుంచి మళ్లీ బయటికి రాకూడదు. 

సూపర్-6తో మీ ముందుకు వస్తున్నాం

ప్రజల జీవితాలను మార్చివేసేలా సూపర్-6 పథకాలను రూపొందించాం.
1. తల్లికి వందనం కింద... ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం.
2. రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం
3. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
4. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500
5. దీపం పథకం ద్వారా పేదలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం
6. యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తాం... ఐదేళ్లలో రూ.20 లక్షలు 
ఉద్యోగాలు కల్పిస్తాం.

నమాజ్ శబ్దం రావడంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపిన చంద్రబాబు

చంద్రబాబు ప్రసంగిస్తుండగా మధ్యలో నమాజ్ శబ్దం వినిపించడంతో తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. నమాజ్ పూర్తయిన అనంతరం ప్రసంగాన్ని కొనసాగించారు.

More Telugu News