Nagababu: ప్రజలారా తస్మాత్ జాగ్రత్త... ఈ విధంగా భూములు కాజేస్తారు!: నాగబాబు

  • జగన్ పాపాలకు ప్రతి ఒక్కరూ బాధితులేనన్న నాగబాబు
  • భూములు కాజేసేందుకు కొత్త విధానం తీసుకువచ్చారని వ్యాఖ్యలు
  • అది కూడా చట్ట పరిధిలోనే అంటూ అలు అంశాలు వెల్లడించిన నాగబాబు
Nagababu releases audio message on land titling

జగన్ రెడ్డి చేసిన పాపాలకు ప్రతి ఒక్కరూ బాధితులేనని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. "ఆంధ్ర ప్రజలారా తస్మాత్ జాగ్రత్త... రాష్ట్ర ప్రజల ఆస్తులు, భూములను కాజేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చిన భూ బకాసురుడు" అంటూ ఇవాళ ఆయన ఓ ఆడియో సందేశం వెలువరించారు. 

"జాగ్రత్తగా వినండి... ఇవాళ మనది అనుకున్న ఆస్తి రేపటి రోజున మనది కాకుండా చేసే కుట్రలకు వైసీపీ ప్రభుత్వం రూపకల్పన చేసింది. అది కూడా చట్టం పరిధిలో చేసింది. మీ తాత, మీ నాన్న, మీ అమ్మ గారో మీకోసం ఆస్తి కూడబెట్టి వారసత్వంగా ఇచ్చుంటారు. వాటి దస్తావేజులు మీ ఇంట్లోనే ఉంటాయి కదా, అలాగే ఆ దస్తావేజుల వివరాలు కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో భద్రంగా ఉంటాయని మనకో ధైర్యం. 

కానీ జగన్ చేసిన కుట్రపూరిత నిర్ణయంతో మన ఆస్తుల వివరాలు మరెక్కడో ఉంటున్నాయి. అలాగే, కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నవాళ్లకు ఇక దస్తావేజులు ఇవ్వడంలేదు... ఒరిజినల్స్ అన్నీ సర్వర్ లో ఉంచేస్తారట! వాటి ఫొటోస్టాట్ కాపీలను మాత్రమే ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 

నాలుగు డబ్బులు కూడబెట్టి పొలమో, స్థలమో కొనుక్కుని ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దస్తావేజులు మన చేతికి వస్తాయి. అవి భద్రంగా ఉంచుకోవాలని ఎవరైనా అనుకుంటారు. కానీ జగన్ తీసుకున్న నిర్ణయంతో దస్తావేజులను మనకు ఇవ్వడంలేదు. కేవలం తెల్ల కాగితంపై ఇచ్చే ఫొటోస్టాట్ కాపీయే మీకు ఆధారం. దాని మీద కూడా కొన్న మీ సంతకం, అమ్మినవాళ్ల సంతకం, సాక్షుల సంతకాలు, చివరికి సబ్ రిజిస్ట్రార్ సంతకం కూడా ఉండదు. 

సంతకం ప్లేసులో టిక్కులు ఉంటాయి. అదేమిటంటే... ఆధార్ లింకు అంటారు... పైగా ఇది డిజిటల్ విప్లవం అని, కార్డ్ ప్రైమ్ 2.0 అని అంటారు. ఇలా ప్రజల ఆస్తులను గుప్పిట పెట్టుకునే పాలన ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ లేదు. ఒకవేళ ఉంటే నియంత కిమ్ జాంగ్ ఉన్ నాయకత్వంలోని ఉత్తర కొరియాలో ఉండొచ్చేమో. కిమ్ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్లు లాగేసుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ, ఇక్కడ మాత్రం జగన్ ఒరిజినల్ దస్తావేజులు పట్టుకుపోతున్నాడు. 

మా పత్రాలు మాకివ్వండి అంటే రూల్స్ మారాయి అంటున్నారు. ఒరిజినల్ దస్తావేజులు ఎక్కడో సర్వర్ లో దాచిపెడతారట! ఆ సర్వర్ భద్రత ఏ స్థాయిలో ఉందో ఎవరికి తెలుసు? ఆ సర్వర్ నిర్వహించేది ఎవరు? ప్రతి ఇంట్లో వాళ్ల వివరాలు, ఫోన్ నెంబర్లు, ఇతర కీలక వివరాలు సేకరించి హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని వైసీపీ వాళ్ల కంపెనీకి చేర్చినట్టుగా, ఏపీ ప్రజల ఆస్తుల వివరాలు, దస్తావేజులు కూడా అక్కడికి చేర్చేస్తే పరిస్థితి ఏమిటి? 

ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటేనే వైసీపీ భూ బకాసురులు హాంఫట్ అంటూ స్వాహా చేస్తున్నారు... ఇక ఫొటోస్టాట్ కాపీలతో ఆస్తులను ఎలా కాపాడుకోవాలి? ఏదైనా అవసరం వచ్చి ఆస్తిని బ్యాంకులో తనఖా పెట్టుకోవాలనుకుంటే ఒరిజినల్స్ అడుగుతారు... ఫొటోకాపీలు పనికిరావు. ఎక్కడో సర్వర్ లో ఉన్న దస్తావేజులు బ్యాంకు వాళ్లకు ఎలా చూపించాలి? 

తస్మాత్ జాగ్రత్త... మన ఆస్తులపై జగన్ అండ్ కో కన్ను వేసింది. అందుకే డాక్యుమెంట్లు మన చేతికి ఇవ్వడంలేదు. మన దస్తావేజులు మనం కాపాడుకోలేమా? వైసీపీ వాళ్లు ఏ దురుద్దేశంతో ఈ రూల్స్ తీసుకువచ్చారో అర్థం చేసుకోండి. రైతులు ఈ కుట్ర మీద ఆలోచన చేయాలి. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మీ దస్తావేజులను వైసీపీ సర్వర్ల నుంచి బయటికి తీసుకువస్తాం. మీ ఆస్తి మీ హక్కు! వాటి పత్రాలు మీ దగ్గర ఉంచుకునేలా చేస్తాం.

డాక్యుమెంట్లు దగ్గరపెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం... ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కొత్త వివాదాలు సృష్టించి మన ఆస్తులను వాళ్ల పేరు మీదకు మార్చుకునే కుట్రలకు తెరదీస్తోంది. ఈ కుట్ర మీద కూడా త్వరలోనే వివరంగా మాట్లాడతాను" అంటూ నాగబాబు పేర్కొన్నారు.

More Telugu News