Nara Bhuvaneswari: మీరు నాకు చెప్పే ప్రతి సమస్యను నేను చంద్రబాబుకు చెబుతాను: నారా భువనేశ్వరి

  • నంద్యాలలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
  • ముస్లిం మహిళలతో ఆత్మీయ సమావేశం
  • మీ సమస్యలు తెలుసుకునేందుకు ఒక స్త్రీగా ఇక్కడికి వచ్చానని వెల్లడి
  • ముస్లింలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీ అని స్పష్టీకరణ
Nara Bhuvaneswari held meeting with Muslim women in Nandyal

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు నంద్యాలలో  ముస్లిం మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, నంద్యాల మహిళలకు నమస్కారాలు అంటూ ప్రారంభించారు. 

నేను రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు

ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అస్సలాం వాలేకుం... నేను రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. మీలో ఒక స్త్రీగా మాత్రమే మీ దగ్గరకు వచ్చాను. మీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. మీరు నాకు చెప్పిన ప్రతి సమస్యను నేను చంద్రబాబుకు చెబుతాను. రంజాన్ మాసం మీకు చాలా పవిత్రమైనది. ఈ మాసంలో మీరు అల్లాను తలచుకుంటూ ఉపవాసంలో ఉంటారు. మీరు కోరుకున్న ప్రతి కోరికను అల్లా తప్పకుండా తీరుస్తారని నేను అనుకుంటున్నాను.

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం

నంద్యాల అంటే నాకు గుర్తుకొచ్చేది చంద్రబాబును జ్ఞానాపురం గ్రామం నుండి అక్రమంగా అరెస్టు చేసిన విధానం! ఏ తప్పూ చేయని చంద్రబాబును, రుజువులు లేకుండా అక్రమంగా అరెస్టు చేశారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని కేవలం కార్యకర్తల కుటుంబాలను పరామర్శించాలని చేపట్టాను. 

అన్న ఎన్టీఆర్ టీడీపీని పేద, బడుగు, బలహీనవర్గాల వారి కోసం స్థాపించారు. అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. చంద్రబాబు కూడా ఎన్టీఆర్ మార్గంలోనే పేదవారికి అనేక పథకాలు అమలు చేసి అండగా నిలిచారు. 

నంద్యాల అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్ధుల్ సలాం, అతని కుటుంబం. వైసీపీ వాళ్ల వేధింపులు తాళలేక కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది. మిస్బా చాలా చిన్న పిల్ల. చదువులో ముందుండడమే మిస్బా చేసిన తప్పా? వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంది.

చంద్రబాబు ఇచ్చిన మాట తప్పరు

చంద్రబాబు మీకు గతంలో మాట ఇచ్చారంటే... దాన్ని ఆయన నిలబెట్టుకుంటారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 45 ఏళ్లు నిండిన మహిళలకు పెన్షన్లు ఇస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదు. ముస్లిం మహిళలకు దుల్హన్ పథకాన్ని రద్దు చేశారు. సబ్ ప్లాన్ అమలు చేస్తామని మాట తప్పారు. 

80 శాతం వక్ఫ్ బోర్డు భూములను వైసీపీ నేతలు ఆక్రమించేశారు....దాదాపు వక్ఫ్ బోర్డు కు సంబంధించిన 30 వేల ఎకరాలను భూకబ్జాలు చేశారు.  ప్రార్థనా స్థలాలు, స్మశాన స్థలాలను కూడా వైసీపీ నేతలు అక్రమించేస్తున్నారు.

ముస్లింలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీ

టీడీపీ పాలనలో షరీఫ్ ను శాసనమండలి చైర్మన్ ను చేశారు. లాల్ జాన్ బాషా ను పార్లమెంటు సభ్యుడిగా చేసింది. 11 లక్షల ముస్లిం కుటుంబాలకు రూ.140 కోట్లతో రంజాన్ తోఫాను 5 ఏళ్ల పాటు చంద్రబాబు అందించారు. మైనారిటీలకు కార్పొరేషన్ ద్వారా 44 వేల మందికి రూ.240 కోట్లను సబ్సిడీల కింద అందించారు. మైనారిటీ సంక్షేమశాఖ ద్వారా రూ.2,500కోట్లను టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 

5.40 లక్షల మంది మైనారిటీ విద్యార్థులకు రూ.1000 కోట్ల లబ్ధి అందించారు. ఇమామ్ లకు రూ.5వేలు, మౌజన్ లకు రూ.3వేలు గౌరవ వేతనం అందించిన ఘనత టీడీపీది. 30,200మంది దీని ద్వారా లబ్ధి పొందారు.

పెన్షన్ల పంపిణీ చేతకాక చంద్రబాబుపై నిందలు వేస్తున్నారు

టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారు. వైసీపీ ప్రభుత్వానికి పేదవాళ్లకు పెన్షన్లు ఇవ్వడం చేతకాక ఆ నెపాన్ని చంద్రబాబు, టీడీపీపై నెట్టేసి ప్రజల్లో విష ప్రచారం చేస్తున్నారు. 

రాష్ట్ర ప్రజలు వైసీపీ కుట్రలను గమనించి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయాలి..ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. కుటుంబాన్ని ముందుకు నడపడానికి తండ్రి ఎంత ముఖ్యమో... రాష్ట్రాన్ని ముందుకు నడపాలంటే మంచి నాయకుడు కావాలి... ఆ నాయకుడే చంద్రబాబు... అని భువనేశ్వరి స్పష్టం చేశారు.

More Telugu News