Worker dead: చందానగర్ లో 30వ అంతస్తు నుంచి పడి కార్మికుడు మృతి

  • కేఎల్ సీ నిర్మాణ సంస్థలో శుక్రవారం మధ్యాహ్నం ఘటన 
  • జాగ్రత్తల విషయం గాలికొదిలేశారంటూ కార్మికుల ఆందోళన
  • మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్
  • చందానగర్ స్టేషన్ లో కేసు నమోదు
worker fell down from 30 floor spot dead in chandanagar

నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు.. 30వ అంతస్తు నుంచి 11 వ అంతస్తులో పడడంతో కార్మికుడు స్పాట్ లోనే చనిపోయాడు. దీంతో తోటి కార్మికులు సదరు నిర్మాణ కంపెనీపై మండిపడుతున్నారు. కార్మికుల భద్రతను గాలికి వదిలేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఇకముందైనా కార్మికుల భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుందీ ప్రమాదం.

పోలీసులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగాల్ కు చెందిన  ఖైరుల్మియా బతుకుదెరువు కోసం భార్య, ఇద్దరు పిల్లలతో పాటు తన మామతో కలిసి పదిహేను రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చాడు. సిటీలో కేఎల్ సీ కంపెనీలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. లింగంపల్లిలో కేఎల్సీ సంస్థ చేపట్టిన భారీ భవన నిర్మాణంలో పనిచేస్తుండగా శుక్రవారం ప్రమాదం జరిగింది.

30వ అంతస్తులో పనిచేస్తున్న ఖైరుల్ మియా ప్రమాదవశాత్తూ 11వ ఫ్లోర్లో పడిపోయాడు. తీవ్ర గాయాలతో స్పాట్ లోనే తుదిశ్వాస వదిలాడు. ఈ ప్రమాదంతో ఆగ్రహానికి గురైన తోటి కార్మికులు నిర్మాణ సంస్థ ఆఫీసు ముందు ఆందోళన చేపట్టారు. ఆఫీసులోని ఫర్నీచర్ ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కార్మికులను నియంత్రించారు. మృతుడి మామ ఫిర్యాదుతో కేఎల్ సీ కంపెనీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News