Satyavathi Rathod: కేసీఆర్ పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నా.. నేనెందుకు పార్టీ మారతాను: సత్యవతిరాథోడ్

  • పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించిన సత్యవతి రాథోడ్
  • తాను ఓడిపోయినా మంత్రిని చేశారని గుర్తుచేసుకున్న మాజీమంత్రి
  • ఆయన మూడోసారి సీఎం కావాలని చెప్పులు లేకుండా పాదయాత్ర చేశానని గుర్తుచేసుకున్న సత్యవతి
Satyavathi Rathod Responds Over Party Change

బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి చేయిస్తూ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై మాజీమంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తాను పార్టీని వీడడం లేదని, అదంతా తప్పుడు ప్రచారమని తేల్చి చెప్పారు. 

తాజాగా, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేరు వినిపిస్తోంది. ఆమె కూడా త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్టు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆమె కూడా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ వీడుతున్న నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు తమ స్వార్థం కోసం పార్టీ మారుతున్నారని విమర్శించారు. తాను మాత్రం అలా చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. 

ఎన్నికల్లో ఓడిన తనను కేసీఆర్ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన మూడోసారి సీఎం కావాలని చెప్పులు కూడా వేసుకోకుండా పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. కేసీఆర్ పేరును పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నానని తెలిపారు. అలాంటి తాను పార్టీ ఎందుకు మారతానని ప్రశ్నించారు. కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటనే ఉంటానని సత్యవతిరాథోడ్ తేల్చి చెప్పారు.

More Telugu News