Rains: తెలంగాణవాసులకు చల్లని కబురు.. రేపటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • హైదరాబాద్‌ కు లేని వర్ష సూచన
  • పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం
  • నిన్న నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • ఎండవేడితో ఏడీడీ బారిన పడుతున్న చిన్నారులు
Rains in Telangna in next 3 days

భానుడు నిర్దాక్షిణ్యంగా సెగలు కక్కుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వేడి దంచేస్తుండడంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. దీనికితోడు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వారిని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ తెలంగాణ ప్రజలకు చల్లని వార్త మోసుకొచ్చింది. రేపటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలతోపాటు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఎల్లుండి వర్షాలు పడతాయంటూ ఎల్లో అలెర్ట్ జారీచేసింది. మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నప్పటికీ హైదరాబాద్ వాసులకు మాత్రం నిరాశే. భాగ్యనగరంలో మాత్రం వర్షం పడే అవకాశం లేదని పేర్కొంది.  

వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఉష్ణోగ్రతలు రెండుమూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది. రాష్ట్రంలో గరిష్ఠంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. నేడు పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. నిన్న అత్యధికంగా నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు అక్యూట్ డయేరియా డిసీజ్ (ఏడీడీ) బారినపడుతున్నారు. డీహైడ్రేషన్ కేసులు కూడా పెరుగుతున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. పిల్లలు వాంతులు, విరేచనాలకు గురైనప్పుడు కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ వంటివి ఇవ్వాలని, నీడపట్టున ఉంచాలని సూచించారు.

More Telugu News