Telangana: తెలంగాణలో మండుతున్న ఎండలు... బయటకు రావొద్దని హెచ్చరిక

  • పలుచోట్ల 43 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు
  • పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలు
  • రేపు, ఎల్లుండి వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం నాడు నల్గొండ జల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5, కనగల్‌లో 43.4, మాడుగుపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో రేపు, ఎల్లుండి వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలు కూడా రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలో ఎక్కువగా 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయని... ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని, అత్యవసర పరిస్థితుల్లో  బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశముందని తెలిపింది.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. 

ఆదివారం నాడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. 

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.

More Telugu News