Chandrababu: పాలకొల్లు సభలో ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీలను ప్రస్తావించిన చంద్రబాబు

  • పాలకొల్లులో ప్రజాగళం సభ
  • ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయం అని చంద్రబాబు ధీమా
  • దుర్మార్గుడి పాలనలో అభివృద్ధి  రివర్స్ అయింది అంటూ ఆవేదన
  • ధీరూభాయ్ అంబానీకి ఇద్దరు పిల్లలు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
Chandrababui mentions Ambani bros in Palakollu Praja Galam Rally

టీడీపీ అధినేత చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రజాగళం సభలో ప్రసంగించారు. ఈ సభకు విచ్చేసిన జనాన్ని చూస్తుంటే ఎంతో ఉత్సాహం కలుగుతోందని, గట్టిగా చప్పట్లు కొడితే తాడేపల్లిలో ఉండే పిల్లి జలగ గజగజలాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు అంటే సేవ.. జగన్ కు మాత్రం రాజకీయాలు అంటే అరాచకం, దోచుకోవడం, దాచుకోవడం అని అన్నారు. 

కానీ మన నిమ్మల రామానాయుడు వద్ద ఇప్పటికీ డబ్బులు లేవని, కానీ మనసు ఉందని, మంచితనం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. మీకు కష్టం వస్తే, సంకలో ఒక బ్యాగు పెట్టుకుని, అందులో  వస్తువులు పెట్టుకుని మిమ్మల్ని ఆదుకునే నాయకుడు నిమ్మల రామానాయుడు అని కొనియాడారు. 

కరోనా సమయంలో చూశానని, బయటికి రావడానికే భయపడిన ఆ సయయంలో, రామానాయుడు ఓ సైకిల్ పై ఇంటింటికీ వచ్చి సేవలు అందించాడంటే ఇలాంటి నాయకుడు మరొకరు దొరుకుతారా అని వ్యాఖ్యానించారు. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఈగ లాగా వాలిపోతాడని, కలియుగంలో ఇలాంటి నేతలు ఉంటారా అని ఆశ్చర్యం కలుగుతుందని తెలిపారు. అక్కడ జగన్ కూడా బాబాయిని చంపిన వాళ్లను పక్కనబెట్టుకుని కలియుగం అని మాట్లాడుతుంటాడని పేర్కొన్నారు. నిమ్మల రామానాయుడు మంచికి మారుపేరు... తెలుగుదేశం పార్టీకి సేనాని అని చంద్రబాబు అభివర్ణించారు. 

ఇక, నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. శ్రీనివాసవర్మ బీజేపీ కోసం సిన్సియర్ గా పనిచేశారని, ఆయన చిత్తశుద్ధిని పార్టీ గమనించిందని, ఆ విధంగా ఒక కార్యకర్తకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిందని వివరించారు. 

అందుకే మేం ముగ్గురం కలిశాం

మేం మూడు పార్టీలం జట్టు కట్టాం. మా కోసం కాదు... మీ కోసం. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. అభివృద్ధి ఎలా చేయాలో ఇప్పటికే చేసి చూపించిన పార్టీ టీడీపీ. అందుకు హైదరాబాద్ నగరమే నిదర్శనం. ఆంధ్రలోనూ అంతకుమించిన అభివృద్ధి చేసి తెలుగుజాతిని మిన్నగా నడిపించాలని భావించాను. ఎన్నో కార్యక్రమాలు చేశాను... ఈ దుర్మార్గుడు వచ్చాడు... రివర్స్ పాలన తెచ్చాడు... విధ్వంసంతో ప్రారంభించి చాలా సమస్యలు తెచ్చాడు. అందుకే నేను, పవన్ కల్యాణ్, మోదీ కలిశాం. మళ్లీ వచ్చేది కూడా ఎన్డీయే ప్రభుత్వమే. 

ఈ ఐదేళ్లు కూడా నేనే సీఎంగా ఉండుంటే మరోలా ఉండేది

తెలంగాణను నేనే అభివృద్ధి చేశాను. రాష్ట్రం విడిపోయే రోజున తెలంగాణ కంటే ఆంధ్ర తలసరి ఆదాయం 35 శాతం తక్కువగా ఉంది. ఆ తర్వాత ఐదేళ్ల పాటు కష్టపడ్డాను. తలసరి ఆదాయంలోని అంతరాన్ని 35 నుంచి 27 శాతానికి తగ్గించాను. ఆ తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణతో పాటు ఏపీని కూడా దేశంలోనే నెంబర్ వన్ గా చేసేవాడ్ని. 

2019 ఎన్నికల్లో మనం ఓడిపోయాం. ఇప్పుడు తెలంగాణకు, ఏపీకి మధ్య తలసరి ఆదాయం వ్యత్యాసం ఎంతో తెలుసా... 45 శాతం.  ఈ ఐదేళ్లలో జగన్ ఏం చేసినట్టు? బటన్ నొక్కాను, అది చేశాను, ఇది చేశాను అని చెబుతుంటాడు... ఉత్తుత్తి బటన్ లు నొక్కితే ఎవరికి కావాలి? రూ.10 ఇచ్చి రూ.100 దోచిన దుర్మార్గుడు ఈ జగన్. 

పాలకుడు అసమర్థుడు అయితే ఇలాగే ఉంటుంది

ఈ సందర్భంగా  ఓ విషయం చెబుతాను. భారత సంపన్నుడు ధీరూభాయ్ అంబానీకి ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలకు సమానంగా ఆస్తి పంచి ఇచ్చారు. పెద్ద కొడుకు ముఖేశ్ అంబానీ సమర్థంగా పనిచేసుకుని ఆస్తిని పెంచుకున్నాడు. ఇవాళ ఆయన భారత్ లోనే కాదు, ఆసియాలోనే నెంబర్ వన్ కుబేరుడు. కానీ రెండో కొడుకు (అనిల్ అంబానీ) సమర్థంగా చేసుకోలేక నిరుపేద అయిపోయాడు. కంపెనీలు దివాళా తీశాయి. అప్పులపాలైపోయాడు. 

ఎందుకు ఈ విషయం చెప్పానంటే... ఒక నాయకుడు సమర్థుడు అయితే అగ్రస్థానానికి తీసుకెళతాడు. ఒక నాయకుడు దుర్మార్గుడు అయితే, చేతకాకపోతే అధఃపాతాళానికి పోతారు. ఇప్పుడు నరేంద్ర మోదీ దేశాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. మనం కూడా ముందుకొచ్చి తెలుగుజాతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా తయారుచేయాలన్నది నా ఆకాంక్ష. 

ఇదేమీ అసాధ్యం కాదు

అదే సమయంలో పేదరికం లేని రాష్ట్రంగా తయారుచేయాలన్నది నా కల, ఆశయం... అదే ఎన్టీ రామారావు గారు ఇచ్చిన సిద్ధాంతం. ఇది అసాధ్యమేమీ కాదు. ఒక్క ఉదాహరణ చెబుతా... ఆ రోజు నేను 12.50 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టాను. కానీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఇళ్లు కడుతున్నాడు... ఒక సెంటు జాగాలో ఇల్లు! ఆ సెంటు స్థలంలో కూడా అవినీతి. కేంద్రం ఇచ్చిన రూ.1.50 లక్షలు ఇచ్చి, నరేగా నిధుల్లో రూ.30 వేలు ఇచ్చాడు. 

ఆ రోజు నేను టిడ్కో ఇళ్లు మీ కోసం తీసుకువచ్చాను... కేంద్రం రూ.1.50 లక్షలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేం కూడా రూ.1.50 లక్షలు ఇచ్చాం. అంటే... రూ.3 లక్షలు ఇచ్చాం. 40 అడుగులు, 60 అడుగుల సిమెంట్ రోడ్లు, పార్కులు, తాగునీరు, డ్రైనేజి, కమ్యూనిటీ హాల్, ఆటస్థలం, అంగన్ వాడీ సెంటర్ అన్నీ ఏర్పాటు చేశాను. ఒక గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అభివృద్ధి చేయాలని చూశాను. 

నేను 2019లో కూడా గెలిచి ఆ ఇంటిని మీకు ఇచ్చి ఉంటే, దాని విలువ ఇవాళ రూ.20 లక్షలు ఉండేది. అది అభివృద్ధి అంటే... అదీ సంపద... అదీ నా విధానం. నేను 20, 30 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో కూడా ఇప్పుడు చెప్పగలను, జగన్ 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లాలని ఆలోచిస్తుంటాడు. నువ్వు రాతియుగం వైపు వెళుతున్నావు... నేను స్వర్ణయుగం వైపు వెళుతున్నా. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేని నువ్వు వ్యవస్థల గురించి మాట్లాడతావా, నీతులు చెబుతావా?" అంటూ  చంద్రబాబు ధ్వజమెత్తారు.

More Telugu News