Harish Rao: మీ మేనిఫెస్టోకు ఏమైనా విలువ ఉందా?: రాహుల్ గాంధీకి హరీశ్ రావు బహిరంగ లేఖ

Harish Rao open letter to Rahul Gandhi
  • మేనిఫెస్టో పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని... ఆ తర్వాత విస్మరించడం కాంగ్రెస్‌‌కు అలవాటే అన్న హరీశ్ రావు
  • కాంగ్రెస్ మోసాలను ఇప్పటికే పలుమార్లు చూశామని... లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి మోసం చేయవద్దని సూచన
  • బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ ఇచ్చిందన్న హరీశ్ రావు
  • అలాంటి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తీసుకువస్తామని చెప్పడం విడ్డూరమన్న హరీశ్ రావు
మేనిఫెస్టో పేరుతో మరోసారి ప్రజలను మోసం చేయవద్దని కోరుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. మేనిఫెస్టో పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని... ఆ తర్వాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ మోసాలు ఇప్పటికే పలుమార్లు చూశామని... లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి మోసం చేయవద్దని కోరారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని పార్టీలోకి చేర్చుకొని ఎంపీ టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తీసుకువస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎన్నికలకు ముందు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని, ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మోసం చరిత్రలో చాలాసార్లు రుజువైందన్నారు. మీ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. ఆ రెండు సందర్భాల్లో అటు కేంద్రంలో, ఇటు తెలంగాణలో మీరే అధికారంలో ఉన్నారని గుర్తు చేశారు. కానీ ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి మళ్లీ మీరు తెలంగాణలో పర్యటిస్తున్నారని... కానీ అమలు చేయలేని మేనిఫెస్టో ఎందుకని ప్రశ్నించారు.

మీ మేనిఫెస్టోలకు ఏమైనా విలువ ఉందా? ఇప్పటి వరకు ఒక్క దానినైనా అమలు చేశారా? అలాంటి వారికి మేనిఫెస్టోలు ఎందుకు? ఈసారి మీ మేనిఫెస్టోలో మాకు చెప్పిన మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన లేదనే విషయం ఇప్పటికే రుజువైందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా మీరు చెప్పడం లేదని విమర్శించారు. హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేయడంపై శ్రద్ధ లేని మీకు కొత్త హామీలు ఇచ్చే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ ప్రజలను మళ్లీ మళ్లీ మోసం చేయాలనుకుంటే మీ ఎత్తుగడలు సాగబోవని హెచ్చరించారు.
Harish Rao
BRS
Telangana
Rahul Gandhi
Congress

More Telugu News