IPL 2024: సొంత మైదానంలో ఓట‌మితో డీలాప‌డ్డ‌ గుజ‌రాత్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌.. జ‌ట్టుకు స్టార్ ప్లేయ‌ర్ దూరం!

  • రెండు వారాల పాటు జ‌ట్టుకు దూరమైన‌ స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ మిల్లర్ 
  • డేవిడ్ మిల్ల‌ర్ జ‌ట్టుకు దూర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించిన‌ కేన్‌ విలియమ్సన్
  • నిన్న‌టి పంజాబ్‌తో మ్యాచ్‌లో సొంత మైదానంలోనే కంగుతిన్న గుజ‌రాత్‌
  • 200 ప‌రుగుల భారీ టార్గెట్‌ను కాపాడుకోలేక చ‌తికిల‌ప‌డ్డ‌ జీటీ
Major setback for GT as star player David Miller set to miss matches

గురువారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) చేతిలో హోంగ్రౌండ్ (న‌రేంద్ర మోదీ స్టేడియం) లోనే గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) ప‌రాజ‌యం పాలైన విష‌యం తెలిసిందే. ఈ ఓటమితో డీలా ప‌డ్డ ఆ జ‌ట్టుకు ఇప్పుడు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్‌ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ గాయం కార‌ణంగా ఈ సీజన్‌లో రెండు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. దీంతో ఈ రెండు వారాల్లో జీటీ ఆడే మ్యాచుల‌కు అత‌డు అందుబాటులో ఉండ‌డు. నిన్న‌టి పంజాబ్ మ్యాచ్‌లో కూడా మిల్లర్ ఆడ‌లేదు. అత‌ని స్థానంలో కేన్ విలియమ్సన్ బ‌రిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో కేన్ మామ‌ 26 పరుగులు చేశాడు. ఇక 2022లో జీటీలో చేరినప్పటి నుండి మిల్లర్ జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. అతను హైద‌రాబాద్‌తో జరిగిన మునుపటి మ్యాచ్‌లో 44 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ను ఆడాడు. అలాగే సీఎస్కేపై కూడా 21 పరుగులు చేశాడు.

కాగా, డేవిడ్ మిల్ల‌ర్ జ‌ట్టుకు దూర‌మైన విష‌యాన్ని కేన్‌ విలియమ్సన్ వెల్ల‌డించాడు. పంజాబ్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా ఇన్నింగ్స్ విరామంలో అత‌డు ఈ విష‌యాన్ని తెలిపాడు. ఈ సంద‌ర్భంగా త‌మ జ‌ట్టు 199 ప‌రుగుల భారీ స్కోర్ చేయ‌డంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ కార‌ణ‌మ‌ని కేన్ మామ పేర్కొన్నాడు. గిల్‌ 48 బంతుల్లోనే 89  పరుగులు చేసిన విష‌యం తెలిసిందే. ఇంత భారీ స్కోర్ చేసిన గుజ‌రాత్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. 

200 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్‌కు తొలి ఓవర్‌లో 13 పరుగులతో మంచి ఆరంభం లభించింది. అయితే, రెండో ఓవర్‌లోనే కెప్టెన్ శిఖ‌ర్‌ ధావన్‌ వికెట్‌ను ఉమేష్‌ యాదవ్‌ పడగొట్టాడు. బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్‌లు కొన్ని బౌండరీలు కొట్టినా, పెద్దగా స్కోరు చేయలేకపోయారు. జీటీ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూనే ఉంది. అదే స‌మ‌యంలో పంజాబ్ మంచి స్కోరింగ్ రేటును కొనసాగించింది. చివ‌ర‌కు శశాంక్ సింగ్ 29 బంతుల్లో 61 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

మ‌రోవైపు ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. ఈ ఇద్ద‌రూ బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ‌డంతో పంజాబ్ మరో బంతి మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకుంది. మూడు వికెట్ల తేడాతో ఘ‌న సాధించింది. పంజాబ్‌ 4 మ్యాచుల్లో రెండు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో ఉంటే.. గుజ‌రాత్ కూడా 4 మ్యాచుల్లో రెండు విజ‌యాల‌తో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

More Telugu News