Harish Rao: రేవంత్ రెడ్డి పక్క పార్టీ వాళ్ల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారు: హరీశ్ రావు విమర్శ

  • 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల విషయంలో మోసం చేశారని మండిపాటు
  • సీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామకపత్రాలు ఇచ్చారన్న హరీశ్ రావు
  • కాంగ్రెస్ హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందన్న సిద్దిపేట ఎమ్మెల్యే
Harish rao targets Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని... పక్క పార్టీ వాళ్ల ఇళ్లచుట్టూ తిరుగుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక రైతులను గాలికి వదిలేశారని... 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల విషయంలో మోసం చేశారని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెడితేనే దారికి వచ్చి హామీలను అమలు చేస్తారన్నారు. 

మెదక్ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ... ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు ఇస్తామంటే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి ఆపివేయించారని విమర్శించారు. దుక్కికో.. నాటుకో ఉపయోగపడే రైతుబంధు డబ్బులు పంట కోతకొచ్చినా రాలేదన్నారు. రైతుబంధు కోసం తాము ఉంచిన డబ్బులు కాంగ్రెస్‌ కాంట్రాక్టర్లకు ఇచ్చిందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ పాలనలో కరెంట్ మోటర్లు కాలిపోతున్నాయన్నారు. రైతుభరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎప్పుడంటే అప్పుడు నీళ్లిచ్చామని... రెండు పంటలు పండించుకునేలా నీళ్లిచ్చామన్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో 200మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు తగ్గి కన్నీళ్లు పెరిగాయని ఎద్దేవా చేశారు. పెన్షన్ పెరగలేదని... పైగా జనవరి నెల పెన్షన్ ఎగ్గొట్టిందని ఆరోపించారు. అన్న వస్త్రాలకు పోతే.. ఉన్న వస్త్రాలు పోయినట్లుగా కాంగ్రెస్ పాలన ఉందన్నారు. ఆడబిడ్డల ఖాతాల్లో ప్రతినెలా రూ.2500 వేస్తామని చెప్పి, మోసం చేశారన్నారు. కల్యాణలక్ష్మి లక్షకు తోడు తులం బంగారం ఇస్తానని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేలు ఇస్తామని మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు.

కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామకపత్రాలు ఇచ్చారని, చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని మోసం చేశారన్నారు. ఇన్ని మోసాలు చేసిన కాంగ్రెస్‌కు ఓటేయాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలు నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేశారని... కానీ మోసపోయారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. దుబ్బాక ప్రజలను బీజేపీ రఘునందన్ రావు మోసం చేశారన్నారు. రఘునందన్ రావుని దుబ్బాక ప్రజలు బండకేసి కొట్టారన్నారు. పదేళ్లలో సామాన్యులకు బీజేపీ చేసిందేమీ లేదని... పైగా పెట్రోల్, డీజిల్‌, అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగాయన్నారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు.

More Telugu News