BJP: బీజేపీకి ఓటేస్తే ముస్లింలకు ఇబ్బందులు తప్పవనేది దుష్ప్రచారం: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

  • ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదన్న రాజంపేట అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి 
  • ప్రధాని మోదీ ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుతున్నారని వెల్లడి 
  • పుంగనూరులో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశం
Former CM Kiran Kumar Reddy counters fake propaganda on BJP

బీజేపీకి ఓటేస్తే ముస్లింలకు ఇబ్బందులు తప్పవని దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలపై మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. గురువారం పుంగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. 

రాజకీయమంటే ఇసుక, క్వారీలు, కాంట్రాక్టు పనులకే పరిమితమవ్వడమని భావించి.. ప్రజాసేవను విస్మరించిన నాయకులకు బుద్ధి చెప్పాలని కిరణ్ కుమార్ రెడ్డి ఓటర్లను కోరారు. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడిస్తేనే ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. తప్పుడు కేసులు బయటకురాకూడదనే దురుద్దేశంతో దుష్ప్రచారాలకు దిగుతున్నారని అన్నారు. 

మామిడి, పాలరైతుల కోసం తాను సీఎంగా ఉన్నప్పుడు శ్రీసిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేశానని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెట్టించే తప్పుడు కేసులకు భయపడే పరిస్థితి లేదని పుంగనూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో పీలేరు టీడీపీ అభ్యర్థి కిషోర్‌ కుమార్‌రెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.

More Telugu News