Plants Scream: కూకటివేళ్లతో పెకిలిస్తే మొక్కల ‘ఆక్రందనలు’.. తొలిసారిగా గుర్తించిన శాస్త్రవేత్తలు!

  • టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర అంశాలు
  • కూకటివేళ్లతో పెకిలించినా, కాండాన్ని నరికినా మొక్కలు శబ్దాలు చేస్తున్నట్టు వెల్లడి
  • అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీల్లోని ఈ ధ్వనులు మనుషులు వినలేరంటున్న శాస్త్రవేత్తలు
  • తమ ఇబ్బందిని ప్రపంచానికి మొక్కలు శబ్దాలతో తెలియజేస్తాయంటున్న పరిశోధకులు
Plants Scream When Uprooted Scientists Capture Sound For First Time

తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు మొక్కలు కూడా ‘ఆక్రందనలు’ చేస్తాయని పరిశోధకులు తాజాగా గుర్తించారు. అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీల్లో ఉండే ఈ ధ్వనులు చిటికెలు వేసినట్టుగా ఉంటాయని, మనుషులకు వినబడవని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ అంశాలు తాజాగా సెల్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

చెట్లు, మొక్కలను కూకటి వేళ్లతో సహా పెకలించినప్పుడు, లేదా వాటి కాండాన్ని మధ్యలో నరికినప్పుడు మొక్కలు ఈ ‘ఆక్రందనలు’ చేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. తమ క్లిష్ట పరిస్థితి చుట్టూ ఉన్న జీవాలకు తమదైన శైలిలో మొక్కలు తెలియజేస్తున్నట్టు గుర్తించారు. సాధారణ సమయాల్లో కూడా మొక్కలు కొన్ని రకాల శబ్దాలు చేస్తాయని, మనిషి వినలేని ఈ శబ్దాలను కొన్ని జంతువులు, కీటకాలు గుర్తిస్తాయని తేల్చారు. కీటకాలు, ఇతర జంతువులు సమాచార మార్పిడి కోసం శబ్దాలు చేస్తాయని, కాబట్టి వాటితో నిత్యం ‘సంభాషించే’ మొక్కలు ఎటువంటి శబ్దాలు చేయవని భావించడం సరికాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

ఒత్తిడి సమయాల్లో చెట్లు, మొక్కలు తమ రంగులు మార్చుకోవడం, లేదా ముడుచుకుపోవడం, ఇతర మార్పులకు లోనుకావడం సాధారణంగా చూసేదే. అయితే, ఇవి శబ్దాలను కూడా వెలువరిస్తాయో లేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 

ఈ ప్రయోగాల కోసం శాస్త్రవేత్తలు టమాటాలు, పొగాకు మొక్కలను ఎంచుకున్నారు. మొక్కలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సాధారణ సమయాల్లో చేసే శబ్దాలను పరిశీలించారు. ఇందుకోసం ప్రత్యేకంగా మెషీన్ లర్నెంగ్ ఆల్గోరిథమ్‌ను వాడారు. దీని సాయంతో మొక్కలు వివిధ సందర్భాల్లో చేసే శబ్దాల మధ్య భేదాలను గుర్తించారు. 

ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయాల్లో మొక్కలు మీటరు దూరం మేర వినబడేలా హై పిచ్ శబ్దాలు చేస్తాయని గుర్తించారు. మిగతా సమయాల్లో అవి ప్రశాంతంగానే ఉంటున్నట్టు గుర్తించారు. అయితే, మొక్కలు ఈ శబ్దాలను ఎలా చేస్తాయనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

More Telugu News