Jogi Ramesh: చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలకు వివరణ ఇవ్వండి.. మంత్రి జోగి రమేశ్‌కు ఈసీ నోటీసులు

  • వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు
  • చంద్రబాబుపై అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారంటూ వర్ల రామయ్య ఫిర్యాదు
  • పరిశీలించి నోటీసులు పంపిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా
EC notices to Minister Jogi Ramesh asks Explanation on the objectionable comments on Chandrababu

పింఛన్ల పంపిణీ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై జోగి రమేశ్‌ చేసిన ఆరోపణలతో పాటు వైసీపీ ‘ఎక్స్‌’ ఖాతాలో ఫేక్ పోస్టులు పెట్టారంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా స్పందించారు. చంద్రబాబుపై అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు చేశారని, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదు మేరకు మంత్రి జోగి రమేశ్, వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిలకు గురువారం వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు. గడువులోగా సమాధానమివ్వకపోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్ట్ పంపుతామని ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టుగా ప్రాథమికంగా గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు.

వైసీపీ అధికారిక ఎక్స్‌ ఖాతాలో చంద్రబాబుకు తప్పుదు ఉద్దేశాలు ఆపాదిస్తూ అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఈ నెల 1న వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఆధారాలను పరిశీలించిన ఎన్నికల సంఘం.. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనేనని స్పష్టమవుతోందని అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రకటనలు, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వంపై దాడి, నిరాధార ఆరోపణలు చేయడం పూర్తిగా నిషేధమని మంత్రి జోగి రమేశ్‌కి ఇచ్చిన నోటీసుల్లో ఈసీ పేర్కొంది. ఈ మేరకు వర్ల రామయ్య అందజేసిన ఆధారాలు, వీడియోల్లో పరిశీలించగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తెలుస్తోందని నోటీసుల్లో ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు.

More Telugu News