Butta Renuka: బుట్టా రేణుక ఆస్తుల వేలానికి సిద్ధమైన ఎల్ఐసీ

LIC announces E aution of properties belonging to Butta renuka companies
  • బుట్టా రేణుక భాగస్వామిగా ఉన్న పలు సంస్థలకు చెందిన ఆస్తుల వేలానికి ఎల్‌ఐసీ ప్రకటన 
  • ఎల్ఐసీ నిర్ణయం చట్టవ్యతిరేకమన్న బుట్టా దంపతులు
  • చెల్లింపుల అంశం ఎన్‌సీఎల్‌టీ పరిశీలిస్తోందని వెల్లడి
  • వేలం నిలుపుదలకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడి

వైసీపీ నేత బుట్టా రేణుక భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మరికొన్ని ఇతర సంస్థల ఆస్తులను వేలం వేసేందుకు ఎల్ఐసీ సిద్ధమవడం సంచలనంగా మారింది. మే 6న ఈ-వేలం వేయనున్నట్టు హైదరాబాద్‌లోని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గురువారం ప్రకటన విడుదల చేసింది. 

వ్యాపార అవసరాల నిమిత్తం కొన్నేళ్ల క్రితం వీరు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి రూ.340 కోట్ల రుణం తీసుకున్నారు. కొవిడ్ సమయంలో పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా వాటిని మూసేయాల్సి వచ్చింది. ఇది బుట్టా ఇన్‌ఫ్రాతో పాటూ ఇతర సంస్థలపై ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో రుణ బకాయిలు పేరుకుపోవడంతో తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిర్ణయించింది. 

అయితే, బకాయి చెల్లింపుల అంశం ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ పరిశీలనలో ఉన్నా ఎల్‌ఐసీ వేలం నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఇది నిబంధనలకు విరుద్ధమని బుట్టా రేణుక దంపతులు పేర్కొన్నారు. ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. బుట్టా రేణుక ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తలపడుతున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News