Jagan: ఈ కిచిడీ మేనిఫెస్టోతో మేం పోటీపడాలనుకోవడంలేదు: సీఎం జగన్

  • తిరుపతి జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
  • నాయుడుపేటలో భారీ బహిరంగ సభ
  • చంద్రబాబు వల్లే 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారన్న జగన్
  • జూన్ 4న మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమేనని వెల్లడి 
CM Jagan speech in Naidupet

ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు తిరుపతి జిల్లాలో కొనసాగింది. ఈ సాయంత్రం నాయుడుపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం జగన్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... చంద్రబాబు దుర్మార్గం వల్లే ఇవాళ రాష్ట్రంలో 31 మంది అవ్వాతాతల ప్రాణాలు పోయాయని అన్నారు. పెన్షన్లను మేం చెబితేనే చంద్రబాబు ఆపించారు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారని, వారిది అహంకార ధోరణి అనాలా, సిగ్గులేనితనం అనాలా? అని మండిపడ్డారు. చంద్రబాబును హంతకుడు అందామా, అంతకంటే దారుణం అని అందామా? అని సీఎం జగన్ తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు. 

వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. జూన్ 4న వచ్చేది తమ ప్రభుత్వమేనని, తాము రాగానే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ యథావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. 

"ఈ ఎన్నికలు రెండు వేర్వేరు భావజాలాల మధ్య జరుగుతున్న సంఘర్షణ. పేదల అనుకూల భావజాలం ఒకవైపు, పెత్తందారుల అనుకూల భావజాలం మరోవైపు. ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం కాబట్టే... పొత్తులు, కుట్రలు, ఎత్తులు, జిత్తులతో పనిలేకుండా నేరుగా మీ ముందుకు వచ్చాం. సాధ్యం కాని వాగ్దానాలను కూడా మేనిఫెస్టోలో పెట్టి చంద్రబాబు కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలనుకోవడం లేదు. 

2014లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చాడా అని అడుగుతున్నా. పొదుపు సంఘాలకు పూర్తి రుణమాఫీ అన్నాడు, ఆడబిడ్డ  పుడితే రూ.25 వేలు ఇస్తానన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు, పేదలకు మూడు సెంట్ల స్థలం అన్నాడు... వీటిలో ఒక్క హామీ అయినా నెరవేర్చాడా? 

ఇప్పుడు కూడా ఆ పెద్దమనుషులే మరోసారి రంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు. కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా అని అడుగుతున్నా? వీళ్ల మోసాల నుంచి పేదలను కాపాడుకోవడానికి ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్లు బయటికి రావాలి. ఈ ప్రభుత్వం చేసిన మంచిని వందలమందికి తెలియజేయాలి. 

మరో రెండు నెలల్లో మీ బిడ్డ మళ్లీ  అధికారంలోకి వస్తున్నాడు. ఈసారి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 లోక్ సభ స్థానాలతో డబుల్ సెంచరీ సాధించేందుకు మీ దీవెనలు కోరుతున్నా" అని సీఎం జగన్ పేర్కొన్నారు.

More Telugu News