Nara Bhuvaneswari: ఇలాంటి రాక్షస పాలనలోనూ ధైర్యంగా మీ వద్దకు వచ్చానంటే మీరున్నారన్న నమ్మకమే కారణం: నారా భువనేశ్వరి

  • కడప జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
  • కడప పట్టణంలో చెండ్రాయుడు కుటుంబానికి పరామర్శ
  • ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందంటూ విమర్శలు
Nara Bhuvaneswari Nijam Gelavali Yatra in Kadapa district

టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కడప జిల్లాలో  నిజం గెలవాలి యాత్ర చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. 

ఇవాళ కడప పట్టణంలోని 44వ వార్డులో వరద చెండ్రాయుడు అనే కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. చెండ్రాయుడు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగిస్తోందని, టీడీపీ కార్యకర్తలను హింసించడం, చంపడం, ఇబ్బందులకు  గురిచేయడం నిత్యకృత్యంగా మారిందని మండిపడ్డారు. ఇలాంటి అరాచక పాలనలోనూ ధైర్యంగా మీ వద్దకు వచ్చానంటే, మీరున్నారన్న నమ్మకమే కారణం అని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.

 రానున్న ఎన్నికలను ఆమె కురుక్షేత్ర సంగ్రామంగా అభివర్ణించారు. టీడీపీ కార్యకర్తలు ఈ యుద్ధంలో సై అంటే సై అనేలా ముందుకు ఉరికి నిజాన్ని గెలిపించాలని అని పేర్కొన్నారు. మళ్లీ టీడీపీ జెండా ఎగరాలి... చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి... అందుకోసం మనమందరం ఐక్యంగా పోరాడుదాం అని భువనేశ్వరి పిలుపునిచ్చారు. 

ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని, ఈ ఐదేళ్లు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండుంటే  రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందేదో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం పరిస్థితి పతనమైనందని, ఏపీలో ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదని, ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ముఖ్యంగా, యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపించే వారే లేరని అన్నారు. 

కడపలో పర్యటన అనంతరం నారా భువనేశ్వరి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పర్యటించారు. ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లి గ్రామంలో మరణించిన టీడీపీ కార్యకర్త కూరపాటి రాధ కుటుంబాన్ని పరామర్శించారు. రాధ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

More Telugu News