Gourav Vallabh: కాంగ్రెస్‌కు కీలక నేత గౌరవ్ వల్లభ్ రాజీనామా.. సనాతనధర్మ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేనని లేఖ

  • కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు గౌరవ్ వల్లభ్ రాజీనామా లేఖ
  • దిశానిర్దేశం లేని పార్టీలో కొనసాగలేనని వ్యాఖ్య
  • దేశంలో సంపద సృష్టికర్తల్ని విమర్శించలేనంటూ లేఖ
Congresss Gourav Vallabh resigns says cant raise anti Sanatana slogans

కాంగ్రెస్‌ను వీడినట్టు పార్టీ జాతీయ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ గురువారం ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తూ పార్టీ జాతీయ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. పార్టీ దిశానిర్దేశం లేనిదిగా మారిందని గౌరవ్ తన లేఖలో పేర్కొన్నారు. తాను పార్టీ వీడటానికి కులగణన కూడా ఓ కారణమని అన్నారు. ‘‘దిశానిర్దేశం లేని పార్టీలో కొనసాగలేకపోతున్నాను. దేశంలో సంపద సృష్టికర్తలను విమర్శించలేను, సనాతనధర్మ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేను. కాబట్టి, ప్రాథమిక సభ్యత్వం సహా పార్టీలో అన్ని పోస్టులకు రాజీనామా చేస్తున్నాను’’ అని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 

గౌరవ్ వల్లభ్ గతంలో ఖర్గే అధ్యక్ష ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించారు. 2019లో ఝార్ఖండ్‌లోని తూర్పు జంషెడ్‌పూర్ నియోజకవర్గంలో తొలిసారిగా ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన 18 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2023లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి 32 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

More Telugu News