IIT Bombay: ఐఐటీ బాంబే విద్యార్థుల్లో 36% మందికి నో జాబ్స్!

  • క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌‌కు దరఖాస్తు చేసుకున్న 2 వేల మందిలో 712 మందికి నిరాశ
  • కొత్త నియామకాలకు వెనకాడుతున్న కంపెనీలు
  • అధిక శాలరీ ప్యాకేజీలపైనా విముఖత
36 percent of IIT Bombay graduates fail to get placement says report

వరుసపెట్టి లేఆఫ్స్ ప్రకటిస్తున్న కార్పొరేట్ కంపెనీలు కొత్త నియామకాలకూ వెనకాడుతుండటంతో జాబ్ మార్కెట్‌లో నిరాశాజనక వాతావరణం నెలకొంది. నిత్యం 100 శాతం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ సాధించే ఐఐటీలు, ఐఐఎమ్‌ల్లో కూడా విద్యార్థులు జాబ్స్ విషయంలో సందిగ్ధ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఐఐటీ బాంబేలో ఈసారి నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏకంగా 36 శాతం మందికి ఉధ్యోగం రాలేదని తెలుస్తోంది. 2024 క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం ఈసారి 2000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 36 శాతం మంది.. అంటే 712 మందికి ఉద్యోగాలు రాక నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ప్లేస్‌మెంట్స్ పరంగా 2021, 2022 సంత్సరాల్లో ఐఐటీ బాంబే దేశవ్యాప్తంగా మూడో ర్యాంకులో సాధించింది. గతేడాది నాలుగో స్థానంలో నిలిచింది.  
అధిక శాలరీ ప్యాకేజీలే కారణమా?
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా ఎదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ కోసం కంపెనీలు రావడం కష్టంగా మారిందని ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్ అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. ముందస్తుగా నిర్ణయించిన అధిక శాలరీ ప్యాకేజీలకు అనేక కంపెనీలు సుముఖంగా లేవని చెప్పారు. సాధారణంగా 100 శాతం ప్లేస్‌మెంట్స్ ఉండే కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ బ్రాంచీలలో ఈ ఏడాది తొలిసారి విద్యార్థులందరికీ ఉద్యోగాలు రాలేదని అన్నారు. 

విద్యార్థులకు మంచి శాలరీ ప్యాకేజీల కోసం ఐఐటీలు ప్రయత్నిస్తుండగా కంపెనీలు మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఈ శాలరీలు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగూణంగా లేవని చెబుతున్నాయి. 

తొలి దశ నియామకాల సందర్భంగా డిసెంబర్‌లో 85 మంది విద్యార్థులకు కోటికి పైగా శాలరీతో ఆఫర్స్ వచ్చాయని ఐఐటీ ప్రకటించింది. కానీ ఆ తరువాత సవరించిన సమాచారాన్ని వెల్లడించిన అధికారులు 22 మందికే రూ.కోటిపైగా శాలరీ ఉన్న జాబ్ ఆఫర్స్ వచ్చాయని పేర్కొంది. ఈసారి క్యాంపస్ నియామకాలు మే నెల చివరి వరకూ కొనసాగనుంది. ప్లేస్‌మెంట్స్‌ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నా విద్యార్థులకు మాత్రం సందిగ్ధ పరిస్థితులు తప్పట్లేదు. అనేక మంది ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లుతున్నారు.

More Telugu News